స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న సార్‌

తన జీవితకాలమంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ జయంతి నేడు.

స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న సార్‌
X

నేడు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ జయంతి. తన జీవితకాలమంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన రాష్ట్ర ఆవిర్భావానికి ముందే మన మధ్య లేకపోవడం బాధాకరం. తెలంగాణకు రాజకీయ అస్తిత్వం ఉండాలని సార్‌ బలంగా కోరుకున్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఉద్యమకాలంలో పదే పదే చెప్పేవారు. అలాగే ఎన్టీఆర్‌ వచ్చాక తెలంగాణ ప్రాంతంలో జరిగిన విధ్వంసం, చంద్రబాబు హయాంలో జరిగిన ఎన్‌కౌంటర్లు, అణిచివేత గురించి ఆయన అనేక వ్యాసాలు, ప్రసంగాల్లో చెప్పారు. మేము వచ్చాకే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందనే వాదనను తిప్పికొట్టారు. హైదరాబాద్‌ వందల ఏళ్లకు ముందే ప్రపంచస్థాయి నగరంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని సోదాహరణంగా వివరించారు. అసలు హైదరాబాద్‌ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుంచే తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురైందని అంకెలతో సహా వివరించారు.తెలంగాణకు నీళ్లు, నిధులు, నియమాకాల్లో ఎలా అన్యాయం చేశారో, ఎంత వివక్ష చూపారో నాటి ఉమ్మడి పాలకులు అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ఆధారంగానే ఎండగట్టారు.

పద్నాలుగేళ్ల పోరాటం, త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ వారికి పాలన చేతగాదని, వచ్చిన తెలంగాణ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని ఎద్దేవా చేసిన వాళ్లే తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేలా పదేళ్లలో తెలంగాణ పాలనా విధానాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశంలో అనేక రాష్ట్రాలు అనుసరించేలా బీఆర్‌ఎస్‌ పాలన కొనసాగింది అంటే అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కాంగ్రెస్‌ కొన్ని సెక్షన్లను అడ్డం పెట్టుకుని చేసిన అసత్య ప్రచారాల వల్ల రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. ప్రజల తీర్పును బీఆర్‌ఎస్‌ గౌరవించింది. తెలంగాణ అస్తిత్వాన్ని, సాగు నీటి రంగంలో రాష్ట్ర హక్కుల విషయంలో పదేళ్లలో ఎన్నడూ రాజీపడలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా తమ కంటే ఉన్నతంగా పాలించాలని, ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేలా పాలనా విధానాలు తీసుకోవాలని కోరింది.

కానీ రేవంత్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఎనిమిది నెలల పాలనా కాలంలో తీసుకున్న వివాదాస్పద విధాన నిర్ణయాల వల్ల తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడింది. 58 ఏళ్ల వలస పాలన నుంచి విముక్తి కలిగి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వ పార్టీని దెబ్బతీయాలని చూసిందో, ఏ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ పదాన్ని ఉచ్చరించవద్దన్నదో ఆ పార్టీనే తిరిగి ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేసే స్థితికి తీసుకొచ్చారు. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను మార్చే ప్రక్రియ మొదలుపెట్టారు. బీఆర్‌ఎస్‌ గట్టిగా నిరసించడం, ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో వెనక్కి తగ్గింది. జయశంకర్‌ సార్‌ అన్న తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని బలహీన పరిచే కుట్రలు ప్రారంభించింది. తద్వారా పరోక్షంగా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఏపీ విన్నింగ్‌ కూటమి తెలంగాణలోనూ రిపిట్‌ చేయడానికి రేవంత్‌ చర్యలు దానికి దోహదం చేస్తున్నాయనే విమర్శలు వాస్తవమే అనేలా ఉన్నాయి.

(నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ జయంతి)

Raju

Raju

Writer
    Next Story