స‌ఖ్య‌త స‌రే.. ఇంకేదైన సంగ‌తుందా?

రేవంత్‌లో జోష్ పెంచిన చంద్ర‌బాబు గెలుపు

స‌ఖ్య‌త స‌రే.. ఇంకేదైన సంగ‌తుందా?
X

రాష్ట్రంలో అధికారంలో ఉండి, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు గెలువ‌లేక‌పోయినా సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ జోష్ మీదున్నారు. త‌న కార‌ణంగానే కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య‌లో సెంచ‌రీ మార్క్ దాట‌లేక‌పోయింది అనే బెరుకు ఎక్క‌డా లేదు. 12 ఎంపీ సీట్ల‌ను గెలుస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు, పోలింగ్ ముగిసిన త‌ర్వాత బీరాలు ప‌లికిన రేవంత్‌.. ఎనిమిది స్థానాల‌తోనే స‌రిపెట్టుకున్నా దాన్ని పెద్ద విజ‌యంగానే చెప్పుకుంటున్నారు. కేంద్రంలో మోదీని గ‌ద్దె దించి ప్ర‌జ‌లు రాహుల్ గాంధీని ప్ర‌ధాని పీఠంపై కూర్చోబెడుతార‌ని రేవంత్ ఎన్నిక‌ల‌కు ముందు గట్టిగానే చెప్పారు. మాట‌ల‌ను ఎంతో గ‌ట్టిగా చెప్పిన తెలంగాణ సీఎం అందుకు అవ‌స‌ర‌మైన గ్రౌండ్ వ‌ర్క్ మాత్రం ఆ స్థాయిలో చేయ‌లేదు. ఫ‌లితంగా రాష్ట్రంలో బీజేపీ త‌న ప్రాబ‌ల్యం గ‌ణ‌నీయంగా పెంచుకుంది. కేంద్రంలో మోదీ మూడోసారి ప్ర‌ధాని బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్నారు. త‌న‌ను సీఎం కూర్చీలో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీకి మాత్రం పీఎం ప‌ద‌వి ద‌గ్గ‌రికే వ‌చ్చిన‌ట్టు వ‌చ్చి దూర‌మైంది. అయినా రేవంత్ మాత్రం ఉత్సాహంగానే ఉన్నారు. ఎందుకంటే ఏపీలో చంద్ర‌బాబు గెలిచారు. త్వ‌ర‌లోనే సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. ఆయ‌న ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రుకావాల‌న్న ఉత్సాహం, ఉత్సుక‌త‌ను రేవంత్ దాచుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేదు. పార్టీ హైక‌మాండ్ ఓకే అంటే పొరుగు రాష్ట్రం ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి వెళ్తాన‌ని కూడా చెప్పారు. చంద్ర‌బాబు నాయుడు బీజేపీ నాయ‌క‌త్వంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ప్ర‌ధానిగా మోదీని బ‌ల‌ప‌రిచారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎంగా బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ఉన్నారు. రాజకీయంగా చంద్ర‌బాబు, రేవంత్‌వి వేర్వేరు దారులు. అయినా పొరుగు రాష్ట్రంతో స‌ఖ్య‌త పేరు చెప్పి చంద్ర‌బాబుతో అంట‌కాగుతాన‌ని రేవంత్ బాహాటంగానే చెప్తున్నారు. బుధ‌వారం త‌న నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌ర‌వుతాన‌ని చెప్పారు.

ఇరుగు పొరుగు రాష్ట్రాల‌తో స‌ఖ్యంగా ఉండ‌టం మంచిదే. ప‌దేళ్ల క్రితం వ‌ర‌కు ఒకే రాష్ట్రంగా కొన‌సాగిసిన ప్ర‌స్తుత విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ కూడా ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటే అభివృద్ధి చెందాల‌నే ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ ఆహ్వానించాల్సిందే.. కానీ ఆ ముసుగు వెనుక ఇంకేమైనా ఎజెండా ఉందా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చంద్ర‌బాబు ఏపీ సీఎం అయ్యారు. ఆయ‌న పార్టీకి అప్పుడు తెలంగాణ‌లో 15 మంది ఎమ్మెల్యేల సంఖ్య‌బ‌లం ఉండేది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా గెలవాలంటే ఒక పార్టీకి 20 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు అవ‌స‌రం. స‌రిప‌డా సంఖ్యాబ‌లం లేకున్నా రేవంత్ ప్రోత్బ‌లంతోనే చంద్ర‌బాబు ఇక్క‌డ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌రిలో అభ్య‌ర్థిని నిలిపాడు. ఆ అభ్య‌ర్థిని గెలిపించ‌డానికి ఎమ్మెల్యేల‌తో భేర‌సారాల‌కు రేవంత్‌ను పుర‌మాయించారు. ఒక ఎమ్మెల్యేకు రూ.50 ల‌క్ష‌లు ఇవ్వ‌బోతూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చెప్పారు. రేవంత్ డ‌బ్బుతో ప్ర‌లోభ పెట్టబోయిన ఎమ్మెల్యేతో అప్ప‌టి ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు ఫోన్ లో బ్రీఫ్డ్ మీ అని మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ పెట్టి పార్టీ ఫిరాయింప‌జేసి కేసీఆర్‌ను గ‌ద్దె దించాల‌న్న కుట్ర అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇక్క‌డ కేసీఆర్ ను ప‌ద‌వీచ్యుతిడి చేయ‌డం ఒక్క‌టే ల‌క్ష్యం కాదు.. కొత్త‌గా ఏర్ప‌డి తెలంగాణ‌ను ఒక విఫ‌ల ప్ర‌యోగంగా చూపించాల‌నే కుట్ర దాగి ఉంది. ఈ ప‌న్నాగాన్ని అప్ప‌టి సీఎం కేసీఆర్ సాక్షాధారాల‌తో స‌హా బ‌ట్ట‌బ‌య‌లు చేశారు కాబ‌ట్టే హైద‌రాబాద్ ప‌దేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్నా స‌రే చంద్ర‌బాబు పెట్టేబేడా స‌ర్దేసుకొని అమ‌రావ‌తికి షిష్ట్ కావాల్సి వ‌చ్చింది. అప్పుడు తెలంగాణ‌ను విఫ‌ల రాష్ట్రంగా చూపించాల‌నే ప్ర‌య‌త్నించిన చంద్ర‌బాబు, రేవంత్ ఇప్పుడు సీఎంలుగా ఉన్నారు. వేర్వేరు రాజ‌కీయ కూట‌ముల్లో వారిద్ద‌రూ ఉన్నా క‌ల‌గ‌లిసి పోవడానికి, చెట్టాప‌ట్టాలేసుకొని తిర‌గ‌డానికే ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇటీవ‌ల తిరుమ‌ల శ్రీ వేంక‌టేశుడి ద‌ర్శ‌నానికి వెళ్లిన‌ప్పుడు రేవంత్ మీడియాతో మాట్లాడారు.. త్వ‌ర‌లో ఏపీలో ఏర్ప‌డ‌బోయే కొత్త ప్ర‌భుత్వంతో స‌న్నిహిత సంబంధాలు ఉంటాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు గెలువ‌బోతున్నాడ‌నే న‌మ్మ‌కంతోనే రేవంత్ తిరుమ‌ల‌లో మాట్లాడారు. ఏపీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన చంద్ర‌బాబుకు రేవంత్ గురువారం ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలిపారు. గ‌తంలో త‌న‌తో పాటు బాబు టీమ్‌లో ప‌ని చేసిన సీత‌క్క‌, వేం న‌రేంద‌ర్ రెడ్డి కూడా ఆ స‌మ‌యంలో రేవంత్ వెంట ఉన్నారు.

విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌త్సంబంధాల కోసం తెలంగాణ‌, ఏపీ సీఎంలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటే మంచిదే. ద‌శాబ్దానికి పైగా అప‌రిష్కృతంగా ఉన్న అనేక స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌స్తే రెండు రాష్ట్ర‌ల‌కూ ప్ర‌యోజ‌న‌క‌ర‌మే. 2019లో ఏపీ సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన తెలంగాణ‌, ఏపీ మ‌ధ్య ఉన్న అనేక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరికింది. అప్ప‌టి వ‌ర‌కు ఏపీ అధీనంలో ఉన్న సెక్ర‌టేరియ‌ట్ భ‌వ‌నాల‌ను జ‌గ‌న్ వెకేట్ చేయించ‌డంతోనే కొత్త సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణం సాధ్య‌మైంది. ఇప్పుడు రెండు రాష్ట్రాల సీఎంలు స‌ఖ్య‌త‌తో మెలిగి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తే మంచిదే.. కానీ తెలంగాణ‌ను ముంచే, ద‌క్షిణ తెలంగాణ‌ను ఎడారిగా మార్చే ఏపీలోని ఇరిగేష‌న్ ప్రాజెక్టుల విష‌యంలో ఎలా ముందుకెళ్తార‌నే దానిపై ముందే ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌త‌నివ్వాలి. మ‌నం మ‌నం బ‌రంపురం అనే రీతిలో తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న బెట్టి త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే చంద్ర‌బాబు, రేవంత్ క‌లుస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. తెలంగాణ‌పై ఏదో కుట్ర జ‌రుగుతోంద‌ని, అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కూడా సోష‌ల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. తాను చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ప‌ని చేయ‌లేద‌ని, ఆయ‌న స‌హ‌చ‌రుడినే త‌ప్ప అనుచ‌రుడిని ఏమాత్రం కాద‌ని కొన్నాళ్ల క్రితం రేవంత్ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. రేవంత్ త‌న స‌హ‌జ శైలిలో బెదిరింపు ధోర‌ణిలోనే ఈ వివ‌ర‌ణ ఇచ్చి ఉండొచ్చు కానీ బాబు, రేవంత్ మైత్రి గురించి తెలిసిన వారికి అనేక సందేహాలు ఉండ‌టం స‌హ‌జం. అందుకే రెండు రాష్ట్రాల స‌ఖ్య‌త పేరుతో రేవంత్ ప్ర‌వ‌చ‌నాలు ఓకేగానీ.. దీనివెనుక సీక్రెట్ ఎజెండా ఏమైనా ఉందా అనే సందేహాలే ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు గెలుపు త‌ర్వాత రేవంత్ క‌న‌బ‌రుస్తున్న ఉత్సాహమే ప‌లు సందేహాల‌కు దారితీస్తోంది. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ఉన్న‌రేవంత్ రెడ్డినే ఇలాంటి అనుమానాల‌కు ఆస్కారం ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలే.. లేదంటే ఆయ‌న అడుగుల వెనుక ఇంకేదో ర‌హ‌స్య ఎజెండా ఉంద‌నే సందేహాలను సామాన్యులు సైతం లేవెనెత్తడం అత్యంత స‌హ‌జం.

Vamshi

Vamshi

Writer
    Next Story