ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌ హోళ్లు తెరవొద్దు

హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు ఎండీ అశోక్‌ రెడ్డి

ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌ హోళ్లు తెరవొద్దు
X

భారీ వర్షాలతో రోడ్లపై వరద నీరు నిలిచిందని ప్రజలు తమకు తాముగా ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌ హోళ్లు తెరవొద్దని హైదారబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు ఎండీ అశోక్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి ఉన్నతాధికారులు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లతో ఆదివారం ఆయన జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. అధికారులు తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు. నగరంలోని వాటర్‌ లాగింగ్స్‌ పాయింట్స్‌ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సహాయక చర్యల్లో ఈఆర్టీ, ఎస్పీటీ టీమ్‌ లు పాల్గొనాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో తాగునీటి నాణ్యత పరీక్షించాలన్నారు. అవకాశం ఉన్న క్లోరిన్‌ బిల్లలు పంపిణీ చేయాలన్నారు. నీళ్లు కలుషితం అయిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలన్నారు. వాటర్‌ లాగింగ్‌ ఏరియాలతో పాటు జలమండలి పనులు చేసే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు అటువైపునకు రాకుండా చూడాలన్నారు. ఓవర్‌ ఫ్లో అవుతున్న మ్యాన్‌ హోళ్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు సమస్యలు ఎదురైతే కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేయాలని సూచించారు.

Next Story