కదిలిన మంత్రులు.. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన

కృష్ణా, గోదావ‌రి న‌గ‌దుల‌కు వ‌ర‌ద పోటెత్తింది. మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చ‌డంతో ఖ‌మ్మం ప‌ట్ట‌ణం జ‌ల‌దిగ్భందం అయింది. ఖ‌మ్మం ప‌ట్ట‌ణానికి బ‌య‌టి ప్ర‌పంచంతో సంబందాలు క‌ట్ అయ్యాయి.

కదిలిన మంత్రులు.. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
X


తెలంగాణ రాష్ట్రంలో వర్షం బీభత్సం సృష్టించింది. గ్రామాలు, పట్టణాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలో 18 మంది మృతి చెందారు. 117 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. మహబూబాబాద్‌లో రాళ్ల వాగు ఉప్పొంగింది. వరద ఉధృతికి డీసీఎం కొట్టుకుపోయింది. గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తింది. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో ఖమ్మం పట్టణం జలదిగ్బంధమైంది. ఖమ్మం పట్టణానికి బైటి ప్రపంచంలో సంబంధాలు కట్‌ అయ్యాయి.భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని బోరబండ, అల్లాపూర్‌, యూసఫ్‌నగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష ముగిసింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య లేకుండా కమిషనర్ల చూడాలని సీఎం ఆదేశించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని, విద్యుత్‌ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద వరద తగ్గింది. కోదాడ పెద్ద చెరువు రెండురోజులుగా మత్తడి పోస్తున్నది. పెద్ద చెరువు ఉద్ధృతితో కోదాడ లోతట్టు ప్రాంతాలు కోదాడ నయానగర్‌, శ్రీనగర్‌, షిర్డీసాయి నగర్‌, వరద ముంపులో ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది వరద బాధితులను తరలించింది. విజయవాడ- హైదరాబాద్‌ జాతీయరహదారిపై 3 కి.మీ. మేర లారీలు నిలిచిపోయాయి.

కోదాడ బైపాస్‌ వద్ద సరుకు లారీలు భారీగా నిలిచాయి. గరికపాడు వద్ద రోడ్డు కోతకు గురికావడంతో నిన్నటి నుంచి ఎన్‌హెచ్‌పై లారీలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లు పడిగాపులుగాస్తున్నారు. మిర్యాలగూడ వైపు వెళ్లే లారీలను అధికారులు వెనక్కి మళ్లిస్తున్నారు.

కోదాడ ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఉత్తమ్‌

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నడిగూడెం, కోదాడ, చిలుకూరులో పర్యటించారు. కోదాడ ముంపు ప్రాంతాలను పరిశీలించారు.

మంత్రి పొంగులేటికి గాయం

ఖమ్మం మున్నేరు వరద ప్రాంతాలు పెద్ద తండా, సాయికృష్ణనగర్‌, నాయుడుపేట, ఖమ్మం జలగం నగర్‌, ఆర్టీసీ కాలనీల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటిస్తున్నారు. వరద ప్రాంతాల్లో మంత్రి బైక్‌పై ప్రయాణించారు. బైకు పై నుంచి కింద పడటంతో మంత్రి పొంగులేటికి కాలికి గాయమైంది.ఎవరూ పట్టించుకోవడం సాయికృష్ణనగర్‌ మహిళలు మంత్రి ఎదుట వాపోయారు. రెండురోజులుగా వరదల్లో ఉన్నా అధికారులు రాలేదని బాధితులు ఫిర్యాదు చేశారు. వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. వరద సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అధైర్య పడవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుంది: తుమ్మల

ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు పర్యటిస్తున్నారు. ఖమ్మం కవిరాజునగర్‌, వెంకటేశ్వర కాలనీ, దంసలాపురం మంత్రి పర్యటించారు. వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మున్నేరు వరదల్లో సర్వం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్య పడవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

సిద్దిపేటలో స్తంభించిన జనజీవనం

భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లాలో జనజీవనం స్తంభించింది. మిర్దొడ్డిలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. కూడవెల్లి, మోహితుమ్మెద, తాడూరు, ఖాతా వాగులు పొంగుతున్నాయి. వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. మిట్టపల్లి వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. రోడ్డు కొట్టుకుపోవడంతో సిద్దిపేట నుంచి హుస్నాబాద్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. రాజీవ్‌ రహదారిపై వరద నీటి వల్ల వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. చెరువులు, వాగులు పొంగే చోట ఎవరూ వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మిర్దొడ్డిలో అత్యధికంగా 16 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. రాఘవపూర్‌లో 14.7, నారాయణరావుపేటలో 14.4 సెం.మీ, కొండపాకలో 11, వెంకట్రావుపేటలో 11 సెం.మీ నమోదైంది.

నేలకూలిన విద్యుత్‌ స్తంభాలు

ఈదురుగాలులకు సంగారెడ్డిలో 11 కేవీ విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. కంగ్టి మండలం చాప్ట (కె) శివారు పొలాల్లో విద్యుత్‌ స్తంభాలు కూలాయి. వరద ప్రవాహంతో జహీరాబాద్‌-బీదర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో మహబూబ్‌సాగర్‌ చెరువు మత్తడి పోస్తున్నది. రాయికోడ్‌ రహదారిపై బసవన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి. భారీ వర్షాలకు చౌటకూరులో ఇల్లు కూలింది. ఈ ఘటనలో ప్రమాదం తప్పింది. చౌటకూరు-పోసానిపేట రోడ్డుపై చెట్టు విరిగిపడింది.

వరదల వల్ల నర్సంపేటలో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా భారీ వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మాదన్నపేట పెద్దవాగు ఉద్ధృతితో మాదన్నపేటతో పాటు మరో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గురజాల వద్ద కల్వర్టుపై వరద ప్రవాహంతో నిలిచిన రాకపోకలు. ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ శివారు పాకాల చెరువు భారీగా వరద నీరు చేరుతున్నది. నర్సంపేట, కొత్తగూడ మీదుగా భద్రాచలం వైపు రాకపోకలు బంద్‌ అయ్యాయి.

Raju

Raju

Writer
    Next Story