ఫైనల్‌లో వినేశ్ స్థానంలో లోపేజ్‌

అంతర్జాతీయ రెజ్లింగ్‌ నిబంధనల్లో ఆర్టికల్‌ 11 ప్రకారం క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో ఫొగాట్‌ చేతిలో ఓడిపోయిన క్యూబా రెజ్లర్‌ గుజ్‌మాన్‌ లోపేజ్‌ఫైనల్‌ పోరుకు అవకాశం కల్పించింది.

ఫైనల్‌లో వినేశ్ స్థానంలో లోపేజ్‌
X

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ను దురదృష్టం వెంటాంది. ఆరంభం నుంచి అద్భుతమైన పోరాట పటిమతో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఆమె భారత్ కు బంగారు పతకాన్ని అందిస్తుందని అందరూ భావించారు. అనూహ్యంగా అనర్హత వేటుకు గురైంది. 50 కేజీల విభాగంలో పోటీపడిన వినేశ్‌ నిర్దేశించిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నదంటూ ఒలింపిక్స్‌ కమిటీ, రెజ్లింగ్‌ కమిటీ అనర్హత వేటు వేశాయి. ఫైనల్‌ చేరిన కనీసం రజితం ఖరారు చేసుకున్న ఫొగాట్‌ పై ఎవరూ ఊహించని విధంగా అనర్హత వేటు పడటంతో యావత్‌ దేశం నిర్ఘాంతపోయింది.

50 కేజీల విభాగంలో మంగళవారం క్వార్టర్స్‌ ఫైనల్‌, సెమీ ఫైనల్‌లో ప్రత్యర్థులను మట్టికరిపించిన ఫొగాట్‌ పసిడి పతకంపై ఆశలు రేపింది. మహిళ విభాగంలో మొదటిసారి ఫైనల్ కు చేరిన భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది.ఫొగాట్‌ బరువు విషయంలో ఆమె బృందం కృషి చేసిందని ఐఓఏ వెల్లడించింది. అయినప్పటికీ కాస్త బరువు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నది. అనర్హత వేటు నిర్ణయంపై సమీక్షించాలని ఐవోఏ డిమాండ్‌ చేసింది. దీన్ని ఒలింపిక్‌ కమిటీ తోసి పుచ్చింది.

యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ నిబంధనల ప్రకారం బరువు ప్రమాణాలను అందుకోని క్రీడాకారిణిపై అనర్హత వేటు వేస్తారు. అలాగే ఆ పోటీల్లో చివరి ర్యాంక్‌ ఇస్తారు. ఫైనల్‌ నుంచి బైటికి వెళ్లిన వినేశ్‌కు రజత పతకం ఇవ్వరు. అంతర్జాతీయ రెజ్లింగ్‌ నిబంధనల్లో ఆర్టికల్‌ 11 ప్రకారం క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో ఫొగాట్‌ చేతిలో ఓడిపోయిన క్యూబా రెజ్లర్‌ గుజ్‌మాన్‌ లోపేజ్‌ఫైనల్‌ పోరుకు అవకాశం కల్పించింది. ఫైనల్‌లో టోక్యో కాంస్య విజేత సారా హిల్డర్‌ బ్రాంట్‌ (అమెరికా)తో లోపేజ్‌ తలపడుతారు. ఇవాళ రాత్రి 11.23 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభమౌతుంది. కాంస్య పతకం కోసం జపాన్‌ క్రీడాకారిణి సుసాకీ, ఉక్రెయిన్‌ కు చెందిన ఒక్సాన తలపడనున్నారు.

Raju

Raju

Writer
    Next Story