వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ గా కోదండ రెడ్డి.. ఆకునూరి మురళికి విద్యా కమిషన్‌ పగ్గాలు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. రైతు సంక్షేమ కమిషన్‌ ఏర్పాటు లక్ష్యాలతో మరో జీవో

వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ గా కోదండ రెడ్డి.. ఆకునూరి మురళికి విద్యా కమిషన్‌ పగ్గాలు
X

తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ గా కిసాన్‌ కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు కోదండ రెడ్డి, తెలంగాణ విద్య కమిషన్‌ చైర్మన్‌ గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఆకునూరి మురళిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు లక్ష్యాలను వివరిస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. కోదండ రెడ్డి సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు. తన రాజకీయ జీవితం మొత్తం కిసాన్‌ కాంగ్రెస్‌ లోనే సేవలందించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఆకునూరి మురళి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాగో తెలంగాణ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనకు తెలంగాణ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ చైర్మన్‌ గా పగ్గాలు అప్పగించారు.




వ్యవసాయ కమిషన్‌ లక్ష్యాలివే..

ఆధునిక వ్యవసాయ పద్ధతులు ప్రోత్సహించడం, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచడం, సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, అన్ని రకాల రైతులు మెరుగైన ఆదాయం సాధించేలా వారికి శిక్షణ ఇవ్వడం, వ్యవసాయం చేసే వారికి మాత్రమే ప్రభుత్వ మద్దతు అందేలా చూడటం, వ్యవసాయ కూలీల సంక్షేమానికి సూచనలు చేయడం, పంటల వైవిధ్యం పెంచడం, ఉద్యాన పంటల విస్తరణ, జీవాల పెంపకం సహా వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలను ప్రోత్సహించడం, రోడ్లు, గోదాములు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రోత్సహించడం, వాతావరణ మార్పులు, కరువును తట్టుకునే పంటలు, వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రైతు సహకార సంఘాలను బలోపేతం చేయడం, ఇన్నోవేషన్‌ ఈకో సిస్టం బలోపేతం చేయడం లక్ష్యంగా కమిషన్‌ పని చేయనుంది. కమిషన్‌ కు చైర్మన్‌ తో పాటు గరిష్టంగా ఆరుగురు సభ్యులు ఉంటారని తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అపార అనుభవం ఉన్న వ్యక్తి చైర్మన్‌ గా వ్యవసాయం, అనుబంధ రంగాలలో నైపుణ్యం ఉన్న వ్యక్తులు, రైతులు, రైతు సంఘాలలో పని చేసిన వ్యక్తులు, మహిళ రైతు, వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Next Story