కాలె యాదయ్యకు కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి నిరసన సెగ

కాలె యాదయ్య కాంగ్రెస్‌లో చేరికను వ్యతిరేకిస్తూ ఆపార్టీ కార్యకర్తలు శిలాఫలకం ధ్వంసం చేశారు.

కాలె యాదయ్యకు కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి నిరసన సెగ
X

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారుతున్నది. మొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై వ్యక్తమైన నిరసనే నేడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు ఎదురైంది. కాలె యాదయ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ ఇటీవల వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొండల్‌ యాదవ్ నిరాహారదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే యాదయ్య తన నియోజకవర్గ పరిధిలోని నవాబ్‌ పేట మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉన్నది. ఆయన పర్యటను వ్యతిరేకించిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే కార్యక్రమాలలో పాల్గొనబోమంటూ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. దీంతో నియోకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అధికారంలో ఉన్నంత కాలం పదవులు అనుభవించి అధికారానికి దూరమైన తర్వాత పార్టీ వీడటాన్ని నిరసస్తూ పార్టీ వీడుతున్నవారికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తమను ఇబ్బందులకు గురి చేసిన వాళ్లను తీసుకొచ్చి కాంగ్రెస్‌ కండువా కప్పడాన్ని ఆపార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు తమ నిరసనను వివిధ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ చేరికపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వర్గీయుల నుంచి బహిరంగంగానే అసమ్మతి ఎదురైంది. జీవన్‌రెడ్డితో కలిసి పనిచేస్తానని సంజయ్‌ చెబుతున్నా కాంగ్రెస్‌ కార్యకర్తల ఆగ్రహం చల్లారడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కాలె యాదయ్య రాకనూ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు.

Raju

Raju

Writer
    Next Story