ఇదేనా ప్రజా పాలన అంటే? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ?: సబితా

ఎమ్మెల్యేల ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న ఉల్లంఘనలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. మా హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

ఇదేనా ప్రజా పాలన అంటే? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ?: సబితా
X

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆరు నెలలుగా ప్రతి నియోజకవర్గంలో ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకే ప్రభుత్వ అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు.ప్రోటోకాల్ పాటించకుండా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేత ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న ఉల్లంఘనలను స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లామని మహేశ్వరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆమె మాట్లాడుతూ..

నిన్న మహేశ్వరంలో నియోజకవర్గలో ఎన్నికల్లో ఓడిపోయి మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థిని స్టేజి పైన కూర్చొబెట్టారు. పార్టీ కండువాలు వేసుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పాల్గొంటున్నారు. దీన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లి గెలిచిన ఎమ్మెల్యేల హక్కులను కాపాడాలని వారిని కోరాం. నా నియోజకవర్గంలో ఎండో మెంట్ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా సర్దుకు పొమ్మని ఎమ్మెల్యేకే చెప్పే పరిస్థితిని ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజా పాలన అంటే? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని సబిత ప్రశ్నించారు.

ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థుల ను తీసుకువచ్చి కూర్చొబెడుతున్న మాదిరిగానే అధికార పార్టీ నియోజకవర్గాల్లోనూ ఓడిపోయిన అభ్యర్థులను వేదికపైన కూర్చోబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఓడిపోయిన మా పార్టీ అభ్యర్థిని కూడా పక్కన కూర్చోబెట్టుకోవాలి. అవసరమైతే ఈ మేరకు చట్టాన్ని కూడా సవరించాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు.

మా పార్టీకి చెందిన హుజురాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, అసిఫాబాద్, మహేశ్వరం వంటి అనేక నియోజకవర్గాల్లో పోలీసులు ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యేలపైనే కేసులు పెడుతున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్తే కేసులు పెడతారా? అని మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు ఉన్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్వీకర్ పైన ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేసి ఈ దిశగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరామన్నారు.

హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉన్నది: సునీత లక్ష్మారెడ్డి

నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గతంలో నియోజకవర్గానికి సంబంధించి అనేక అంశాలపై ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇష్టానుసారంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను ప్రత్యేక అతిథులుగా పిలుచుకొని మరి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని. ఓడిపోయిన ఎమ్మెల్యేలు తమ వాహనాలపైన ఎర్రబుగ్గలు వేసుకొని తిరుగుతున్నారు. జిల్లా యంత్రాంగానికి ఆ విధంగానే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా కనిపిస్తున్నది అన్నారు. మా హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉందని స్పీకర్ కోరామని చెప్పారు. స్పీకర్ కు తెలియకుండా ఎమ్మెల్యేల పైన కేసులో నమోదు చేస్తున్న విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనలు, పోలీస్ కేసుల పైన ఎమ్మెల్యేల హక్కులను స్పీకర్ కాపాడుతారని విశ్వాసం ఉన్నదన్నారు.

ఇలాగే ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగితే కోర్టులను ఆశ్రయిస్తాం:పద్మారావు గౌడ్

క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఓడిపోయిన వారిని అనుమతిస్తూ ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా శాసనసభకు అనుమతించాలని స్పీకర్ కు సూచించానని మాజీమంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు.రానున్న శాసనసభ సమావేశాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను కూడా శాసనసభలోకి ప్రభుత్వం తీసుకురావాలని కోరాను. ఇలాగే ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగితే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామన్నారు.

Raju

Raju

Writer
    Next Story