పాఠ్యపుస్తకాలపైనా పాలిటిక్సేనా?

పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకం ముందుమాటలో ముఖ్యమంత్రి, మంత్రుల పేర్లలో పొరపాట్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందుమాటలో దొర్లిన తప్పులనే పట్టుకుని రేవంత్‌ ప్రభుత్వం రాజకీయం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

పాఠ్యపుస్తకాలపైనా పాలిటిక్సేనా?
X

పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకం ముందుమాటలో ముఖ్యమంత్రి, మంత్రుల పేర్లలో పొరపాట్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంబంధిత బాధ్యులపై వేటు వేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నది. కానీ పాఠశాలల విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక ఇంకా ఇదే అంశాన్ని భూతద్దంలో చూసి గత ముఖ్యమంత్రి, మంత్రుల పేర్లు కనిపించకూడదని, ఆ ప్రభుత్వ ఆనవాళ్లు ఉండకూడదనే ఆలోచన సరికాదు. ఎందుకంటే చరిత్ర ఒకరు చెరిపేస్తే చెరిగిపోదు. పుస్తకం ముందుమాటలో కేసీఆర్‌ పేరు ఉన్నంత మాత్రాన ప్రస్తుత సీఎం ఆయనే అని పిల్లలు అనుకోరు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్నలేవీ తలెత్తవు. కనుక పాఠ్యపుస్తకం ముందుమాటలో దొర్లిన తప్పులనే పట్టుకుని రేవంత్‌ ప్రభుత్వం రాజకీయం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

పాఠ్యపుస్తకాల్లో ఏవైనా అక్షర దోషాలు ఉన్నా, అన్వయ దోషాలు ఉన్నా వాటిని సరిదిద్ది విద్యార్దులకు బోధించడం టీచర్ల బాధ్యత. ఆ పనిని వాళ్లు చిత్తశుద్ధితోనే నిర్వర్తిస్తారు. ఇటీవల ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయుల వల్లనే తనకు ఎక్కువ మేలు జరిగిందన్నారు. ప్రభుత్వపాఠశాల్లోనే క్వాలీఫైడ్‌ టీచర్లు ఉంటారని ప్రభుత్వంలోని మంత్రులు పదే పదే చెబుతున్నారు. మరి ఇన్ని చెబుతున్న వాళ్లు ముద్రణ సమయంలో జరిగిన పొరపాటును అంత పెద్ద ఇష్యూ చేయాల్సి అవసరం ఏమున్నదనేది విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు. మరో విషయం కూడా వాళ్లు స్పష్టం చేస్తున్నారు. 6 నుంచి 10 తరగతి వరకు రోజు ఐదు క్లాసులు చెప్పే తెలుగు, సోషల్‌ టీచర్లు విద్యార్థులకు కొన్ని జనరల్ నాల్జెడ్జ్‌కు సంబంధించిన అంశాలపై వాస్తవాలే బోధిస్తారు. ఎందుకంటే ఏడాది కాలంలో వీటిపై విద్యార్థులకు ప్రశ్నలు వస్తాయి. వాటిలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు వంటి ప్రశ్నకూడా ఉంటుందని చెబుతున్నారు. కనుక వ్యక్తులుగా ఎవరి రాజకీయ అభిప్రాయాలు ఎలా ఉన్నా బోధన విషయంలో మాత్రం విద్యార్థులకు కరెక్టుగానే చెబుతారని అంటున్నారు.

ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియంది కాదు. కానీ కేసీఆర్‌, వారి ప్రభుత్వ హయాంలో ఏం చేసినా అది కరెక్టు కాదనే అభిప్రాయం కాంగ్రెస్‌ నేతల్లో ఉన్నది. అందుకే గడిచిన ఏడు నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా, వాటి అమలు గురించి కార్యాచరణ మొదలుపెట్టకుండా కేవలం సంచలనాల కోసమే ప్రతీది రాజకీయం చేస్తున్నట్టు స్పష్టమౌతున్నది. ఈ విషయం ప్రజలకు స్వల్పకాలంలోనే అర్థమైంది. బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా వాటిని అములు చేసింది. అంతేగాని గత పాలకులను నిందిస్తూ కాలం గడుపలేదని చాలామంది గుర్తుచేస్తున్నారు. కానీ రేవంత్‌ ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నదని అందుకే ఏడు నెలల పాలనలోనే పదేళ్ల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మారకపోతే ఏం చేయాలో ప్రజలకు స్పష్టత ఉంటుంది అంటున్నారు.

Raju

Raju

Writer
    Next Story