రేవంత్‌ మగాడైతే సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావాలి: కేటీఆర్‌

దమ్ముంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు అశోక్ నగర్ కు రావాలి. మేమంతా కూడా వస్తాం. అశోక్ నగర్ లో విద్యార్థులు మీరు ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు చెప్పిన సరే మేమంతా రాజీనామా చేస్తామని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు

రేవంత్‌ మగాడైతే సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావాలి: కేటీఆర్‌
X

రాహుల్ గాంధీ నేను నిన్ను అడుగుతున్న నువ్వు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలేవీ ? క్యాలెండర్ లో తేదీలు మారుతున్నాయి. కానీ ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలు ఏవీ? అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు బయట కనబడితే నిరుద్యోగులు తన్ని తరిమే పరిస్థితి ఉన్నదని, అందుకే నాలుగు కాగితాల మీద ఏది పడితే అది రాసుకొచ్చారు. అది జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారని ధ్వజమెత్తారు.జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం ఒక్క ఉద్యోగాన్ని కూడా ప్రకటించకపోవటంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ

స్వయంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. 9 నెలల కిందట ఉద్యోగాల పేరుతో ఎంత డ్రామా చేశారో మీరు చూశారు. కేసీఆర్ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలంటూ పత్రికల్లో ఊదరగొట్టే విధంగా అక్రమ సంపాదనతో ప్రకటనలు ఇచ్చారు.మీ జాబ్ క్యాలెండర్ నిజమైతే అందులో 2 ఉద్యోగాలు కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

దమ్ముంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు అశోక్ నగర్ కు రావాలి. మేమంతా కూడా వస్తాం. అశోక్ నగర్ లో విద్యార్థులు మీరు ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు చెప్పిన సరే మేమంతా రాజీనామా చేస్తామని సవాల్‌ విసిరారు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలంటూ మేము ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను మీరిచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటున్నారు. రేవంత్ మాట్లాడితే నువ్వు మగాడివైతే అంటాడు. ఆయన మగాడైతే సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావాలి. మీరు అక్కడికి వస్తే విద్యార్థులు మిమ్మల్ని తన్ని తరిమేస్తారని కేటీఆర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.

నిన్న రాత్రి జీవో నంబర్ 46 ను సవరించాలంటూ దిల్ సుఖ్ నగర్ లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అటు బిల్లుల కోసం 1800 మంది సర్పంచులు సచివాలయం ముట్టడిస్తే వారిని అరెస్ట్ చేశారు. మార్పు, మార్పు అంటూ నిరుద్యోగులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఎవరితో గోక్కోకూడదో వారితో గొక్కున్నారు. కావాలనే నిరుద్యోగులను, యువతను రెచ్చగొట్టి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చారు. మీ జాబ్ క్యాలెండర్ బోగస్, అందులో తారీఖులు తప్ప ఏమీలేదని విమర్శించారు. దాని గురించి చర్చించాలని అడిగితే స్పీకర్ గారు మాకు 2 నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదు. రాష్ట్రంలో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన అంశం కన్నా ప్రాధాన్యమైన అంశం ఇంకేముంది? అని ప్రశ్నించారు. ఈ అంశం మీద చర్చించాలంటే పారిపోయారని ఎద్దేవా చేశారు.

గ్రూప్ 1, గ్రూప్-2, గ్రూప్ 3 లో ఉద్యోగాల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రూప్- 1 లో 1: 100 పిలవాలంటే తప్పించుకున్నారు.జీవో నంబర్ 46 ను సవరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. జాబ్ క్యాలెండర్ పై చర్చిద్దామంటే మా పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేతో ఇష్టమొచ్చినట్లు తిట్టించారు. ఆ ఎమ్మెల్యే బజారు భాషలో మాట్లాడిండు. మా కోవా లక్ష్మి అక్క ఆ భాష వినలేక మనం ఇక్కడ ఉండొద్దంటూ వెళ్లిపోదామని కోరారు. తెలంగాణ యువత తరఫున మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇంత బజారు భాషలో మమ్మల్ని తిట్టిస్తారా? ఇంత దిగజారుడు, దివాళా కోరు ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. కాంగ్రెస్ వాళ్లను ఎక్కడికక్కడ కొట్టాలి.ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి అందరినీ ఉసిగొల్పుతూ బజారు భాష మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి శాడిస్ట్ పనులు ఎక్కువ కాలం నడవవు అని కేటీఆర్‌ అన్నారు.ఈ ఐదారు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగలేదని అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి ఒక శాడిస్ట్ మా ఆడబిడ్డలను, మా ఎమ్మెల్యేలను తిట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఇవాళ తెలంగాణ శానస సభలో చీకటి రోజు. వాళ్ల బజారు భాష వినలేక మేము అక్కడ ఉండవద్దని వచ్చేశాం. బోగస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు గన్ పార్క్ వద్ద కు వచ్చి నిరసన తెలుపుతున్నామన్నారు.

హైదరాబాద్ విషయంలో సభలో తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్రం అప్పుల పాలైందంటూ తప్పుడు కూతలు కూశారు. ఈ రాష్ట్రం సంపద గల రాష్ట్రమని మేము లెక్కలతో చెప్పే సరికి చేసేదేమీ లేక సైలెంట్ అయ్యారు. తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టించే చిల్లర ప్రయత్నం చేస్తున్న చిల్లర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ చేస్తున్న డ్రామాలు ఇకనైనా ప్రజలు అర్థం చేసుకోవాలని కేటీఆర్‌ కోరారు.ఆరు నూరైనా వందరోజుల్లో గ్యారంటీలు అన్నారు. కానీ ఇప్పటివరకు హామీలను అమలు చేయలేదు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామన్నారు.

Raju

Raju

Writer
    Next Story