నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నది.

నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
X

రాష్ట్రంలోని సిద్దిపేట, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, కొమురం భీం ఆసిఫాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా కొహెడలో అత్యధిక 22.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరింది. రోడ్లు, ఇళ్లలోకి నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. హుస్నాబాద్‌ మండలం పందిల్ల వద్ద భారీ వరదతో రాకపోకలు నిలిచిపోయాయి. హుస్నాబాద్‌లో ఎల్లమ్మ చెరువు మత్తడిపోస్తున్నది. మెదక్‌ జిల్లా వనదుర్గామాత ఆలయం ముందు ఉద్ధృతంగా నది పాయ ప్రవహిస్తున్నది. గర్భగుడిలో అమ్మవారికి అభిషేకం, సహస్రమార్చన చేసిన అనంతరం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వర్షం పడుతున్నది. పాకాల వాగు ఉద్ధృతికి మహబూబాబాద్‌లో గార్ల నుంచి రాంపురం, మద్దివంచకు రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచే యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూరు మండలాల్లో వర్షం కురుస్తున్నది. భారీ వర్షాల కారణంగా మూసీలో వరద పెరిగింది. వలిగొండ మండలం భీమలింగం వద్ద లోలెవల్‌ వంతెనను తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతున్నది. మూసీ ఉధృతితో భీమలింగం వల్ల రాకపోకలను పోలీసులు నిలిపివేవారు. దీంతో సంగెం, బొల్లెపల్లితోపాటు పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి.

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వర్షం పడుతున్నది. భూపాలపల్లి, గణపురం, చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్లలో వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో భూపాలపల్లి సింగరేణి 2, 3 ఓపెన్‌కాస్టుల్లోకి వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.

నాలుగు రోజులుగా అంధకారంలోనే ముంపు కాలనీలు

ఖమ్మం జిల్లాలో ముంపు కాలనీలు నాలుగు రోజులుగా అంధకారంలోనే ఉన్నాయి. 5 వేల మంది బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. ముంపు కాలనీల్లో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

అలుగు పారుతున్న ఇల్లందులపాడు చెరువు

భద్రాద్రి జిల్లాలో వరద ఉద్ధృతికి సత్యనారాయణపురం-ఇల్లందు మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి. ఇల్లందులో కల్వర్టులు, వంతెన పై నుంచి బుగ్గ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో ఇల్లందు స్టేషన్‌ బస్తీలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. ఇల్లందు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన నీటిమట్టం

ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. కిన్నెరసాని ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో ఏజెన్సీ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. గుండాల, ఆళ్లపళ్లి మండలాల్లో కిన్నెరసాని ప్రవాహం ఉధృథంగా ఉన్నది. గుండాల, కొడవటంచ మధ్య ఏడు మెలికల వాగు లోలెవల్‌ వంతెనపై ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కొడవటంచ, పాలగుడం, నాగారం గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

Raju

Raju

Writer
    Next Story