హోం మంత్రి నివాసాన్ని చుట్టుముట్టిన వరద నీరు

భారీ వర్షాలకు గరికపాడు వద్ద రోడ్డు తెగిపోయింది. వరద ప్రవాహానికి 200 పాడి గేదెలు కొట్టుకుపోయాయి.భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమైన సీఎం చంద్రబాబు

హోం మంత్రి నివాసాన్ని చుట్టుముట్టిన వరద నీరు
X

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు ఏకమై రహదారులను ముంచెత్తడంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. లోతట్లు ప్రాంతాకలు ముంపు నుంచి తప్పించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలకు గరికపాడు వద్ద రోడ్డు తెగిపోయింది. గుంటూరు జిల్లాలో భారీ వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.తుళ్లూరు మండలం రాయపూడి పెదలంకలో వరదలో 200 పాడి గేదెలు కొట్టుకుపోయాయి.

విజయవాడలో భారీ వర్షాలకు హోం మంత్రి అనిత నివాసాన్ని వరద నీరు చుట్టుముట్టింది. దీంతో ఆమె తన పిల్లల్ని ఓ ట్రాక్టర్‌ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. రామవరప్పాడు వంతెన కింద ఆమె ఉండే కాలనీ జలదిగ్బంధంలోనే ఉన్నది. ఆదివారం నుంచి అనిత నివాసం వరద ముప్పులోనే ఉన్నది. వరద ముంపులోనే ఆమె సహాయ చర్యల్లో పాల్గొన్నారు.మరోవైపు విపత్తు నిర్వహణశాఖ బృందం మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నాయి. తన ఇంటి వద్ద కంటే ముంపు ప్రాంతాల్లో ముందు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని హోం మంత్రి ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము 4 గంటల వరకు సుడిగాలి పర్యటన చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయన నిర్విరామంగా పర్యటిస్తూ వరద పరిస్థితులను సమీక్షించారు. అజిత్‌సింగ్‌నగర్‌, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించారు. జూపూడి, మూలపాడులో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో సీఎం బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు.

లక్ష మందికి ఆహారం సిద్ధం చేయించాలని సీఎం ఆదేశం

విజయవాడలో వరద బాధితులకు ఆహారం అందించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దుర్గగుడి ద్వారా ఆహారం తయారు చేయించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దుర్గగుడి అధికారులతో సీఎం మాట్లాడారు. ఇవాళ 50 వేల మందికి పులిహోర సిద్ధం చేయాలని సిద్ధం చేశారు. ప్రైవేట్‌ హోటల్స్‌ యజమానులతో సీఎం మాట్లాడారు. ఉదయంలోపు లక్ష మందికి ఆహారం సిద్ధం చేయించాలని ఆదేశించారు.

వరదలకు వెలగలేరు షట్టర్లు ఎత్తడమే కారణమా?

విజయవాడ నగరంలో భారీ వరదలకు వెలగలేరు షట్టర్లు ఎత్తడమే కారణంగా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు వద్ద బుమేరకు గండిపడింది. వెలగలేరు వద్ద 11 షెట్టర్లను 11 అడుగులు ఎత్తి దిగువనకు నీరు వదలడంతో ఆ ప్రభావం విజయవాడ నగరంపై పడింది. వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కష్ణా వరద వెనక్కి తన్ని ఎన్టీటీపీఎస్‌ ప్లాంట్‌లోకి నీరు చేరే ప్రమాదం ఉన్నదని ఒతిళ్లు రావడంతో వెలగలేరు షట్టర్లను శనివారం రాత్రికి రాత్రే ఎత్తడంతో విజయవాడను అతలాకుతలం చేసినట్లు తెలుస్తోంది.

పునరావాస శిబిరానికి తీసుకొస్తున్న బోటు గల్లంతైంది. తొట్లవల్లూరు మండలం అన్నవరలంక నుంచి బాధితులను తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు ఆరుగురిని కాపాడగా.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో 11.36 లక్షల క్యూసెక్కులు ఉన్నది. నదీ పరీవహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాల్వలు, కల్వర్టులు, మ్యాన్‌హోల్స్‌కు దూరంగా ఉండాలని సూచించింది. వాగులు, కాల్వలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దని చెప్పింది.

Raju

Raju

Writer
    Next Story