తెలుగు రాష్ట్రాల అభివృద్ధే తెలుగు దేశం ధ్యేయం: చంద్రబాబు

తెలంగాణలో కాంగ్రెస్‌, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని, సిద్ధాంతపరంగా ఆలోచనలు వేరైనప్పటికీ తెలుగు జాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

తెలుగు రాష్ట్రాల అభివృద్ధే తెలుగు దేశం ధ్యేయం: చంద్రబాబు
X

ఏపీలో తన విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశాయని అందుకు తెలంగాణ టీడీపీ శ్రేణులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చిన బాబుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించిమాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్‌ వైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నా రెండు కళ్లు అని అన్నారు. తెలంగాణలో పార్టీ అధికారంలో లేకున్నాకార్యకర్తలు పార్టీ వదల్లేదు. పార్టీ నుంచి నాయకులు వెళ్లారు కానీ.. కార్యకర్తలు వెళ్లలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది అన్నారు. నన్ను జైళ్లో పెట్టినప్పుడు టీడీపీ శ్రేణులు చూపిన చొరవ మరిచిపోలేను. ఆ సమయంలో గచ్చిబౌలిలో నిర్వహించిన సభను మరిచిపోలేను అన్నారు. జైళ్లో పెట్టినప్పుడు హైదరాబాద్‌ వాసులు చేసిన ఆందోళన టీవీలో చూసి గర్వపడ్డాను అన్నారు.

విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నాను. నా చొరవను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉన్నది. తెలుగు భాష, జాతి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభివృద్ధే తెలుగు దేశం ధ్యేయం. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువ. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని, సిద్ధాంతపరంగా ఆలోచనలు వేరైనప్పటికీ తెలుగు జాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామన్నారు.

Raju

Raju

Writer
    Next Story