అక్రమ నిర్మాణాలు కూల్చండి.. సామన్యులను ఇబ్బంది పెట్టొద్దు

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

అక్రమ నిర్మాణాలు కూల్చండి.. సామన్యులను ఇబ్బంది పెట్టొద్దు
X

హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఎవరైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తే కూల్చేయండి కానీ ఆ పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని గుర్తు చేశారు. చెరువుల చుట్టూ ఉన్న పట్టా భూముల్లో పేదలు కట్టుకున్న ఇళ్లు కూల్చేస్తామని హైడ్రా అధికారులు సాహెబ్ నగర్, సరూర్ నగర్, ఫాక్స్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని తెలిపారు. సామాన్య ప్రజలను ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేయడం ఏమిటని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో అయ్యప్ప సొసైటీలో భవనాలు కూల్చే ప్రయత్నంచేశారని.. ఆ తర్వాత ఏం జరిగిందో అందరం చూశామన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించే నమ్మకం లేకనే డైవర్షన్ పాలిటిక్స్ కోసం రేవంత్ రెడ్డి హైడ్రా ను ముందుకు తెచ్చారన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే చెరువులు పూడ్చిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ కుంటను పూడ్చింది ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు పూడ్చిన చెరువులెన్ని అనే లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యలతో సామాన్యులు నష్టపోకుండా బీజేపీ పార్టీ తరపున అండగా నిలుస్తామన్నారు.

Next Story