ఉభయసభల్లో నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీ, మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.

ఉభయసభల్లో నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
X

బడ్జెట్‌ వివిధ అంశాలపై చర్చ సందర్భంగా అధికారపార్టీ తేలిపోయింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సంధించిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా సమస్యలను పక్కదోవ పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న ప్రభుత్వ హామీలపై బీఆర్‌ఎస్‌ రోజూ వాయిదా తీర్మానాలు ఇస్తే వాటిని స్పీకర్‌ తిరస్కరించారు. బడ్జెట్‌ సమావేశాల్లో అధికారపార్టీ ఎనిమిది నెలల కాలంలో ఏం చేసిందో చెప్పకుండా బీఆర్‌ఎస్‌ పాలనపైనే చర్చకు పెట్టింది. ఏ ఒక్క అంశంపై స్పష్టమైన సమాధానం చెప్పకుండా సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. పైగా సభలో విపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు చూపెట్టకుండా అసెంబ్లీ లైవ్‌ కట్ చేసిందని సభ్యుల ఆరోపణలకు జవాబు చెప్పకుండా పారిపోయిన పరిస్థితి ఉన్నది.

ద్రవ్య వినిమయ బిల్లుపై నేడు ఉభయ సభల్లో చర్చ జరగనున్నది. 2024-25 సంవత్సరానికి రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25న ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. శాసనసభ, మండలిలో సాధారణ చర్చతో పాటు అసెంబ్లీలో పద్దులపై చర్చ కూడా పూర్తయ్యింది.

ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన వెంటనే నేరుగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపడుతారు. దీనికోసం అసెంబ్లీలో నేడు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమాధానం ఇస్తారు. శాసనసభలో ఆమోదం తర్వాత మండలిలోనూ చర్చిస్తారు. మండలిలోనూ డిప్యూటీ సీఎం సమాధానం ఇస్తారు. మండలిలోనూ ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు.

మరోవైపు శాసన సభ ముందుకు నేడు రెండు బిల్లులు రానున్నాయి. సివిల్‌ కోర్టుల బిల్లు, తెలంగాణ చట్టాల బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది.

Raju

Raju

Writer
    Next Story