హరీశ్‌ క్యాంప్‌ ఆఫీస్‌పై అర్ధరాత్రి కాంగ్రెస్‌ నేతల దాడి

పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఎక్స్‌ వేదికగా డీజీపీని కోరిన మాజీ మంత్రి

హరీశ్‌ క్యాంప్‌ ఆఫీస్‌పై అర్ధరాత్రి కాంగ్రెస్‌ నేతల దాడి
X

కాంగ్రెస్‌ పాలనలో ప్రశ్నించడం నేరమైంది. ప్రజలకు వాస్తవాలు చెప్పడం ప్రభుత్వానికి కంటగింపు అయ్యింది. ప్రజా పాలనలో ప్రజలకే కాదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రక్షణ ఉండదని కొంతకాలంగా జరుగుతున్న ఘటనలే తెలియజేస్తున్నాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే నిందితుల పక్షాన నిలుస్తున్నారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడమే కాకుండా వైరా సభలో ఎమ్మెల్యే హరీశ్‌రావుపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. బూతులు తిట్టారు. సీఎం వ్యాఖ్యలకు హరీశ్‌ ఎక్స్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. రుణమాఫీపై రేవంత్‌ సర్కార్‌ చేస్తున్న మోసాన్ని ఎండగట్టారు. రుణమాఫీ చేశామని హరీశ్‌ రాజీనామా చేయాలని సీఎం రేవంత్‌ డిమాండ్‌ చేయడమే తరువాయి నిన్న నగరంలో రెండుమూడు చోట్ల పోస్టర్లు వెలిశాయి. దీనిపై నిన్న కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌లో అసలు రుణమాఫీ అంశంపై హరీశ్‌ చేసిన సవాల్‌ ఏమిటి? రేవంత్‌ ప్రభుత్వం చేసింది ఏమిటి? అన్నది క్లియర్‌గా రైతులకు, రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా వివరంగా చెప్పారు.

దీన్ని సహించలేని కాంగ్రెస్‌ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అధికార నివాసంపై కాంగ్రెస్ గూండాలు అర్ధరాత్రి దాడి చేశారు. తాళాలు పగులగొట్టి ఆస్తులను ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. దాడి చేసిన అనంతరం జై కాంగ్రెస్‌ అని నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

'సిద్ధిపేట ఎమ్మెల్యే అధికార నివాసం పై కాంగ్రెస్ గుండాలు దాడి చేయటం రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పకనే చెప్తున్నది. తాళాలు పగులగొట్టి ఆస్తులను ధ్వంసం చేయడం అప్రజాస్వామికమే కాకుండా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.

ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు జోక్యం చేసుకోకుండా, నిందితులకు రక్షణ కల్పించినట్లు తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత నిర్మొహమాటంగా టార్గెట్ చేస్తే, సాధారణ పౌరుల భద్రతకు ఎలాంటి భరోసా ఉంటుందని అని ప్రశ్నించారు.

పోలీసుల సమక్షంలోనే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనపై డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చట్టవిరుద్ధ ఘటనలను సహించరాదని' ఎక్స్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.

Raju

Raju

Writer
    Next Story