వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసింది : వద్దిరాజు రవిచంద్ర

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందని రాజ్య సభలో బీఆర్‌ఎస్ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.

Ravi chandra
X

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎస్సీ వర్గీకరణ మద్దతుగా గతంలో ప్రధాని మోదీకి లేఖ రాశారని రాజ్య సభలో బీఆర్‌ఎస్ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఈ తీర్పుతో మాదిగలు చేసిన 30 ఏళ్లు పోరాటం ఫలించిందని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలు ఓట్ల కోసం నాటకాలు ఆడాయని, రాజకీయం చేశాయని, ఎస్సీలను మోసం చేశాయని ఆరోపించారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌ మాత్రమే ఈ అంశాన్ని రాజకీయంగా కాకుండా సామాజిక న్యాయంలో భాగంగా చూసి సంపూర్ణ మద్దతునిచ్చారని రవిచంద్ర వెల్లడించారు.

రాష్ట్ర ఏర్పాటు జరిగిన తొలి నాళ్లలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం హోదాలో స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా లేఖ ఇచ్చారని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన అంశంలో అధికారం రాష్ట్రాలకు అప్పజెప్పడం సముచితంగా ఉంటుందని కేసీఆర్ గతంలో కోరడాన్ని ఎంపీ వద్దిరాజు ప్రస్తావిస్తూ.. అత్యున్నత న్యాయస్థానం కూడా ఇదే పేర్కొనడం హర్షణీయమన్నారు. ఇది శుభపరిణామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించాలని ఎంపీ రవిచంద్ర కోరారు.

Vamshi

Vamshi

Writer
    Next Story