బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా విద్యాసంస్థలకు హైకోర్టులో ఊరట

అనురాగ్, నీలిమ విద్యాసంస్థల కూల్చివేత విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఊరట లభించింది.

Palla
X

అనురాగ్, నీలిమ విద్యాసంస్థల కూల్చివేత విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఊరట లభించింది. ఈ పిటీషన్ పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు.. తదుపరి విచారణ జరిగే వరకు కళాశాల భవనాలను కూల్చవద్దని ఆదేశాలు ఇచ్చింది. బీఆర్‌ఎస్ నేత పల్లా చేరువులను కబ్జా చేసి విద్యాసంస్థలు నిర్మించారని ఫిర్యాదులు రావడంతో.. హైడ్రా నోటీసులు జారీ చేసింది. అలాగే కొర్రెముల, నల్లచెరువు రికార్డులు సమర్పించాలని ప్రభుత్వానికి చెప్పింది. కాగా చెరువులు, కుంటలు పరిరక్షణే ధ్యేయంగా రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ పరిధిలో చెరువు భూమి కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు అందిన ఫిర్యాదులపై నోటీసులు జారీ చేసి కూల్చివేతలు చేపడుతోంది. ఈ నేపధ్యంలోనే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘట్‌కేసర్ మండలం వెంటాపూర్ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో ఉన్న భూమిని ఆక్రమించి అనురాగ్, నీలిమా విద్యాసంస్థలు నిర్మాణాలు జరిపారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. విద్యాసంస్థల అక్రమ కట్టడాలను తొలగించడానికి సమయం ఇస్తామని వెల్లడించారు.

ముందస్తు నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి వాటిని తరలించేందుకు సహకరిస్తామని వివరించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో ఉన్న విద్యా సంస్థలకు హైడ్రా ఊరట ఇచ్చే నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలపై ఈ దూకుడు ఉండదని, వాటికి కొంత సమయం ఇస్తామని తెలిపింది. అందులో చదువుకునే విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వాటిని కూల్చివేయబోమని వివరించింది. అయితే, ముందస్తుగా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని తెలిపింది. వాళ్లే వారి అక్రమ కట్టడాలను తొలగించాలని సూచించింది. లేదంటే తాము రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది. ఒవైసీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డిలకు చెందిన విద్యా సంస్థలపై ఆరోపణలు వస్తున్నాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ, చంద్రాయాణగుట్టలోని సకలం చెరువు సమీపంలోని ఒవైసీ ఫాతిమా కాలేజీ, మల్లారెడ్డికి సంబంధించిన కొన్ని విద్యా సంస్థలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి

Vamshi

Vamshi

Writer
    Next Story