జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌

గెలుపే లక్ష్యంగా వ్యూహరచన.. 44 మందితో తొలి జాబితాను విడుదల చేసింది.

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌
X

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నది. అది సీట్లు దక్కించుకోవాలనే లక్ష్యంతో కాషాయపార్టీ వ్యూహ రచన చేస్తున్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం సమావేశమైంది. ఈ భేటీకి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు సుధా యాదవ్‌, ఇక్బాల్‌ సింగ్‌ లాల్‌ పురా హాజరయ్యారు.

ఈ సమావేశంలో జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల సన్నద్ధతపై చర్చించినట్లు తెలుస్తోంది. 44 మందితో కూడిన మొదటి జాబితాను నేడు విడుదల చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు ముందు బీజేపీ అగ్రనేతలు ఎనిమిది ర్యాలీలు చేపట్టనున్నారు. జమ్ముకశ్మీర్లో ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. కశ్మీర్‌ లోయలో తాము పోటీ చేయని స్థానాల్లో బలమైన స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇస్తామని తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో సెప్టెంబర్‌ 18, 23, అక్టోబర్‌ 1న మూడు దశల్లో పోలింగ్‌ జరగనున్నది. అక్టోబర్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అలాగే హర్యానా ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 29న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Raju

Raju

Writer
    Next Story