సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం
X

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెరుగుతున్న డెంగీ, చికున్‌ గున్యా, వైరల్‌ జ్వరాలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, పట్టణాలు, గ్రామాల్లో ఫాగింగ్‌, స్ప్రే ముమ్మరం చేయాలన్నారు.

ప్రజారోగ్య పరిరక్షణపై ఉదాసీనంగా వ్యవహరించే ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్యశాఖ అధికారులు, కలెక్టర్‌ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అన్నిజిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్‌ అధికారులు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.

అలాగే ఆరోగ్య, మున్సిపల్‌ శాఖలకు సంబంధించి స్పీడ్‌ (స్మార్ట్‌ ప్రొయాక్టివ్‌ ఎఫిషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ)పై సచివాలయంలో సమీక్ష జరిగింది. ఆయా శాఖల్లో అత్యవసర, ప్రాధాన్యం గల పనులను గుర్తించి వాటిపై సమీక్ష, తక్షణ నిర్ణయాలు చేయడమే స్పీడ్‌ ఉద్దేశం. సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్‌ శాంతికుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు.

32 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆస్పత్రి

గోషామహల్‌లో 32 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మిస్తామని సీఎం తెలిపారు. ప్రస్తుత ఉస్మానియా ఆస్పత్రి భవనాలను పర్యాటక, చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దుతామన్నారు. గోషామహల్‌ పోలీస్‌ స్టేడియాన్ని పేట్లబుర్జుకు తరలించడానికి పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో 15 నర్సింగ్‌ కాలేజీ భవనాలు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది నుంచే నర్సింగ్‌ కాలేజీలను అద్దెభవనాల్లో ప్రారంభించాలని ఆదేశించారు. 22 జిల్లాల్లో ఎకరం స్థలంలో మహిళా స్వయం సహాయ సంఘాలు కొత్త భవనాలు నిర్మిస్తామన్నారు.

డెంగీ కట్టడికి కంట్రోల్‌ రూమ్‌

రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తున్న నేపథ్యంలో పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలందేలా కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. డెంగీ కట్టడికి రాష్ట్రంలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు.

Raju

Raju

Writer
    Next Story