ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌ మంజూరు

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది

ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌ మంజూరు
X

భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రాథమిక ఆధారాల పరంగా ఆయన ఏ నేరానికి పాల్పడలేదని, బెయిల్‌పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు కూడా లేవని అందుకే ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మనీ లాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ ఈ ఏడాది జనవరి 31న అరెస్టయ్యారు. నాటి నుంచి ఆయన బిర్సాముండా జైలు ఉన్నారు. అరెస్టుకు ముందు ఝార్ఖండ్‌లో రాజకీయ పరిణామాలు జరిగాయి. అరెస్ట్‌ నేపథ్యంలో హేమంత్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన భార్య కల్పనా సోరెన్‌ సీఎం అవుతారని బీజేపీ ఆరోపించింది. అయితే అనూహ్యంగా చంపాయి సోరెన్‌ బాధ్యతలు చేపట్టారు.

మనీలాండరింగ్ ఆరోపణలపై జనవరి 31న జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడైన హేమంత్‌ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అరెస్టు చేసింది. కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాల ద్వారా రికార్డులను తారుమారు చేసి, రాంచీలో కోట్ల విలువైన 8.86 ఎకరాల భూమిని సంపాదించేందుకు సోరెన్‌ పథకం పన్నారని ఈడీ ఆరోపించింది.

అయితే సోరెన్ తనపై వచ్చిన ఆరోపణలను చాలాసార్లు ఖండించారు. బీజేపీ తనపై కుట్రపన్ని అరెస్టు చేయడానికి పథకాన్ని రూపొందించిందని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ప్రతిపక్షాలను బలహీనపరచడానికి ఇలాంటి చర్యలు చేపట్టిందనే విమర్శలున్నాయి. తనను అరెస్టు చేయకుండా వేసిన పిటిషన్‌ హైకోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన తర్వాత లోక్‌సభ ఎన్నికల సమయంలో తన పార్టీ తరఫున ప్రచారం చేయాల్సి ఉన్నందున తనకు మధ్యంత బెయిల్‌ మంజూరు చేయాలన్న సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఐదు నెలల తర్వాత సోరెస్‌కు బెయిల్‌ వచ్చింది.

Raju

Raju

Writer
    Next Story