ఆదివారం అఖిలపక్ష భేటీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

ఆదివారం అఖిలపక్ష భేటీ
X

ఈ నెల 22 నుంచి పార్లమెంటు వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నది. అన్నిపార్టీల ఫ్లోర్‌ లీడర్లు ఈ భేటీకి హాజరుకానున్నారు. లోక్‌సభలో విపక్ష నేతగా ఎన్నికైన రాహుల్‌గాంధీకి ఇది మొదటి ఫ్లోర్‌ లీడర్ల సమావేశం కానున్నది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ భేటీకి గైర్హాజరు కానున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

నరేంద్రమోడీ నాయకత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం జులై 23న పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఎన్నికల సంవత్సరం కావడం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తున్నారు. మోడీ నేతృత్వంలోని మూడో ప్రభుత్వంలో ప్రవేశపెట్టనున్న మొదటి బడ్జెట్‌ ఇదే. దీంతో వరుసగా 7 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనతను నిర్మలా సీతారామన్‌ అందుకోనున్నారు. ఇప్పటివరకు మొరార్జీ దేశాయ్‌ వరుసగా ఆరు సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. జులై 22నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి.

నీట్‌, నెట్‌ పేపర్ల లీకేజీతో పాటు, ఇటీవల కాలంలో ఉగ్రవాదుల దాడుల్లో పలువురు జవాన్ల వీర మరణం పొందారు. బీజేపీ విధానాల వల్లనే సైనికులు మూల్యం చెల్లించుకుంటున్నారని రాహుల్‌ గాంధీ కేంద్రంపై ధ్వజమెత్తుతున్నారు. ఈ అంశాలపై పార్లమెంటు సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం జరగనున్నది.

Raju

Raju

Writer
    Next Story