పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కరం చూపాలి : మంత్రి కొండా సురేఖ

పోడు భూముల సమస్యలన్నింటికి శాశ్వత పరిష్కరం పలికేలా మార్గదర్శకాలను రూపొందించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.

Seethakka
X

పోడు భూముల సమస్యలపై అధికారులు లోతైన అధ్యయనం చేపట్టి శాశ్వత పరిష్కరం చూపాలని మంత్రి కొండా సురేఖ ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అటవీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య నెలకొన్న ఘర్షణను నివారించి, ప్రశాంత వాతావరణ నెలకొనేలా విధివిధానాలు రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. పోడు భూములు ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి ? ఎంతమందికి పోడు పట్టాల పంపిణీ జరిగింది? పోడు పట్టాలు పొందిన వారిలో అనర్హులెవరైనా ఉన్నారా ? స్వీకరించిన దరఖాస్తులు ఎన్ని? తదితర అంశాల పై ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలన చేపట్టి నివేదిక రూపొందించాలని మంత్రి సూచించారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ, అడవులు, గిరిజనుల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఐటిడిఎల పిఓలు, డిఎఫ్ఓలు సామరస్యపూర్వకంగా, సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అటవీ భూముల్లో మౌలిక సౌకర్యాల కల్పన సమయంలో అడవుల రమణీయత దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పోడు భూముల సమస్యల పరిష్కారం దిశగా ఆదర్శవంతమైన విధివిధానాలను రూపొందించాక, సీఎం రేవంత్ రెడ్డితో సమావేశాన్ని నిర్వహించి, మార్గదర్శకాలకు ఆమోదం లభించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి సురేఖ అటవీశాఖ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.

సమీక్షా సమావేశానికి హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ తో పాటు, ఆర్మూల్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజనుల పోడు భూముల హక్కులు, అడవుల ఆక్రమణ, అటవీ భూముల గుండా రవాణాకు సంబంధించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి సురేఖతో ప్రస్తావించారు. ఈ సందర్భంగా అటవీభూముల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ అధికారులను మంత్రి మందలించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యలను ఆయా జిల్లాల పరిధిలోని కలెక్టర్లు, డిఎఫ్ఓలు సమన్వయంతో వ్యవహరిస్తూ పరిష్కరించాలని సూచించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story