కుప్పకూలిన 35 అడుగుల శివాజీ భారీ విగ్రహం

విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంపై తప్ప.. నాణ్యతపై దృష్టి సారించలేదని విపక్షాల మండిపాటు

కుప్పకూలిన 35 అడుగుల శివాజీ భారీ విగ్రహం
X

మాల్వన్‌లోని రాజ్‌కోట వద్ద ఏర్పాటు చేసిన మరాఠా రాజు ఛత్రపతి శివాజీ 35 అడుగుల విగ్రహం సోమవారం కూలిపోయింది. నావికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింధుదుర్గ్‌ జిల్లాలోని మాల్వన్‌లో ప్రధాని నరేంద్రమోడీ గత ఏడాది డిసెంబర్‌ 4న ఆవిష్కరించారు. ఏడాదిలోపే విగ్రహం కూలిపోవడంపై విపక్షాలు, ప్రజలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నాణ్యతలేని మెటీరియల్‌ వాడటం వల్లే విగ్రహం కూలిపోయిందని మహాయుతి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి

రాష్ట్ర ప్రభుత్వం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంపై తప్ప.. నాణ్యతపై దృష్టి సారించలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ నష్టం జరిగింది. ప్రధాని మోడీ వచ్చి విగ్రహ ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెండర్లు వేసి దాని ప్రకారం కమీషన్లు ఇస్తున్నది అని ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి జయంత్‌ పాటిల్‌ ఆరోపించారు.

దీనిపై స్పందించిన శిససేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విగ్రహం పనిచేసిన కాంట్రాక్టర్‌ ఎవరు? ఠాణెకు చెందిన ఒక కాంట్రాక్టర్‌కు ఈ పనిని అప్పగించిన విషయం వాస్తవమేనా? సదరు కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? ఖోకే (బాక్సుల) సర్కార్‌కు ఎన్ని బాక్సులు ఇచ్చాడు? అని ఎక్స్‌లో ప్రశ్నించారు. ఈ విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కాంగ్రెస్‌ పార్టీ కేరళ సోషల్‌ మీడియా టార్గెట్‌ చేసింది. ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు రాజ్‌నాథ్‌ కూడా పాల్గొన్నారు. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్‌ వారసత్వానికి అవమానమని మహారాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది.

రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా సింధ్‌దుర్గ్‌ ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన వానలు పడుతున్నాయి. అయితే వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలిచేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. నాణ్యతలేని మెటీరియల్‌ వల్లనే విగ్రహం కూలిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Raju

Raju

Writer
    Next Story