త్వరలోనే 35 ఉద్యోగాలు భర్తీ చేస్తాం

సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన వారికి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

త్వరలోనే 35 ఉద్యోగాలు భర్తీ చేస్తాం
X

త్వరలోనే 35 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సెక్రటేరియట్ లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత సాధించి మెయిన్స్ కు ఎంపికైన వారికి సింగరేణి కాలరీస్ సంస్థ సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం స్కాలర్ షిప్ లు అందజేశారు. ఒక్కో అభ్యర్థి ప్రిపరేషన్ కోసం రూ.లక్ష సాయం అందిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుక తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన వాళ్లు ఆ పరీక్షలో ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్టను పెంచాలన్నారు. మెయిన్స్ లో అర్హత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి కూడా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వారిలో స్కిల్స్ లేవన్నారు. వారి కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఏటా 20 వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు.

2028 ఒలింపిక్స్ టార్గెట్ గా రాష్ట్రంలోని క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఇందుకోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రానున్న పది, 15 రోజుల్లోనే అన్ని యూనివర్సిటీలకు వైస్ చాన్స్ లర్లను నియమిస్తామని, వర్సిటీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని, రాజకీయ లబ్ధి పొందేందుకు వాళ్లు చేస్తున్న కుట్రలకు బలికావొద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story