ఢిల్లీలో కూలిన టెర్మినల్‌ పైకప్పు.. ఒకరు మృతి.. ఆరుగురికి గాయాలు

దేశ రాజధానిలో పడిన భారీ వర్షానికి ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్‌-1 పైకప్పు కూలి కింద ఉన్న కార్లపై పడింది. ఈ దుర్ఘటనలో ఒకరు చనిపోగా.. ఆరుగురికి గాయాలయ్యాయి.

ఢిల్లీలో కూలిన టెర్మినల్‌ పైకప్పు.. ఒకరు మృతి.. ఆరుగురికి గాయాలు
X

దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా భారీ వానలు పడుతున్నాయి. ఈ రోజు ఉదయం పడిన భారీ వర్షానికి ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్‌-1 పైకప్పు కూలి కింద ఉన్న కార్లపై పడింది. ఈ దుర్ఘటనలో ఒకరు చనిపోగా.. ఆరుగురికి గాయాలయ్యాయి. రూఫ్‌ షీట్‌, సపోర్ట్‌ భీములు ధ్వంసమయ్యాయి. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నది. సహాయక చర్యలను వేగవంతం చేశాయి. టెర్మినల్‌-1 నుంచి అన్నిరకాల విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా చెకింగ్‌ కౌంటర్లను మూసి వేశారు. దేశీయ విమాన సర్వీసులు మాత్రమే జరిగే టెర్మినల్‌-1లో సర్వీసులను మధ్యాహ్నం వరకు రద్దు చేసినట్లు ఢిల్లీ విమానశ్రయవర్గాలు తెలిపాయి. టెర్మినల్‌ 2,3 నుంచి యథావిధిగా రాకపోకలు సాగుతాయన్నారు.

పైకప్పు కూలిన టెర్మినల్‌-1ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 5 గంటలకు పైకప్పు ఊడిపడింది. గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. సీఐఎస్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశామన్నారు. ప్రమాద మృతుడి కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం అందిస్తామన్నారు. ప్రయాణికులకు టికెట్‌ ఛార్జీలు వెనక్కి ఇస్తామన్నారు. గాయపడిన వారికి రూ 3 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు చెప్పారు. ప్రయాణికుల భద్రతకే తమకు ముఖ్యమన్నారు.

ఢిల్లీ లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. యమునా వంతెన వద్ద కిలోమీటర్‌ మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. భారీ వర్షాల వల్ల చాలామంది విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారు. ఢిల్లీలో నిన్నటితో కలిపి ఇవాళ్టికి 154 మి.మీ. వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇన్నిరోజులు హస్తిన వాసులు ఎండవేడితో అల్లాడగా.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఢిల్లీని తాకనున్నట్టు ఐఎండీ తెలిపింది.

Raju

Raju

Writer
    Next Story