కాలేజీలో సీక్రెట్‌ కెమెరాల కలకలం

గుడ్లవల్లేరు లోని ఎస్‌ఆర్‌జీఈసీ కాలేజీలో కొనసాగుతున్న ఆందోళన

కాలేజీలో సీక్రెట్‌ కెమెరాల కలకలం
X

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు లోని ఎస్‌ఆర్‌జీఈసీ కాలేజీలో విద్యార్థినుల హాస్టల్‌లోని స్నానాల రూమ్‌లు, మరుగుదొడ్లలో హెడెన్‌ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నది. ఈ ఉదంతంపై అక్కడి విద్యార్థులు కొన్నిరోజులుగా ఆందోళన బాట పట్టారు.అయితే ఈ ఘటనను అధికార యంత్రాంగం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. కాలేజీ నిర్వాహకులు టీడీపీ ప్రముఖులకు సన్నిహితులు కావడంతో దీన్ని పక్కదారి పట్టించేందుకు శతవిధాల యత్నించిందనే ఆరోపణలున్నాయి.

సీక్రెట్‌ కెమెరాలపై ఓ విద్యార్థిని వారం రోజుల కిందటే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం.. ఎదురు కేసులు పెడతామని బెదిరించారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయినా సదరు విద్యార్థి సాహసించి ఫిర్యాదు చేసింది. రహస్య కెమెరాలతో విద్యార్థినుల వీడియోలు చిత్రీకరించినట్లు తెలియడంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నిద్రాహారాలు లేకుండా వర్షంలోనూ హాస్టల్‌ వద్ద భైఠాయించి న్యాయం కావాలంటూ నినదించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాయ్స్‌ హాస్టల్‌ వద్దకుచేరుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ఈ సీక్రెట్‌ వీడియోల విషయంలో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులపై అనుమానాలు వ్యక్తమౌతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని, గుడ్లవల్లేరు జీఈసీ ఇంజినీరింగ్‌ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరు స్నేహితులని, సదరు విద్యార్థినే బాలిక హాస్టల్‌లో హిడెన్‌ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియోలను తన స్నేహితుడికి పంపుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఇంజినీరింగ్‌ విద్యార్థినులు నిందితురాలి స్నేహితుడిపై ఇప్పటికే దాడి చేశారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు సదరు యువతీ, యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యార్థినుల అభ్యర్థన మేరకు మహిళా ప్రత్యేక బృందం, మానవ హక్కుల బృందం నేతృత్వంలో పోలీసు జాగిలాలతో బాలిక హాస్టల్‌ లో తనిఖీలు చేపట్టారు. మహిళా కమిషణ్‌ ఛైర్‌పర్సన్‌ వెంకటలక్ష్మి హాస్టల్‌కు చేరుకుని సదుపాయాలు మరింత మెరుగుపరచాలని సూచించారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో గుడివాడ ఏజీఎఫ్‌సీఎం పి. గాయత్రి న్యాయ విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసున్నారు. ఆందోళన సద్దుమణగకపోవడంతో ప్రిన్సిపల్‌ బి.కరుణ కుమార్‌ కాలేజీకి మూడు రోజులు సెలవు ప్రకటించారు.

Raju

Raju

Writer
    Next Story