వీధి కుక్కల దాడులపై ఉదాసీనత సహించబోం: హైకోర్టు

వీధి కుక్కల దాడుల విషయంలో ఉదాసీనతను సహించబోమని నిర్లక్ష్యం వహించే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.

వీధి కుక్కల దాడులపై ఉదాసీనత సహించబోం: హైకోర్టు
X

హైదరాబాద్‌లో ఏ కాలనీలో చూసినా వీధి కుక్కలు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. వాటిపై నియంత్రణ లేకపోవడం, వాక్సినేషన్‌ చేయకపోవడం, సరైన ఆహారం లేకపోవడంతో రోడ్లపైకి వచ్చే వారిపై దాడి చేస్తున్నాయి. వీధి కుక్కల స్వైరవిహారం విషయంలో జీహెచ్‌ఎంసీ వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కేవలం గణాంకాలు చూపెట్టడంపై అసహసం వ్యక్తం చేసింది. చిన్నారులు కుక్కల దాడిలో చనిపోకుండా చూడాలని ధర్మాసనం ఆదేశించింది. ఆ ఘటనలను కేసుగా కాకుండా మానవీయ కోణంలో చూడాలని పేర్కొన్నది. పేదలు నివసిస్తున్న మురికి వాడలపై దృష్టి పెట్టాలని సూచించింది. ఉదాసీనంగా వ్యవహరిస్తే సహంచబోమని ఇది తీవ్రంగా పరిగణించే అంశమని హైకోర్టు తెలిపింది.

గత ఏడాది బాగ్‌ అంబర్‌ పేటలో కుక్కల దాడిలో ఓ చిన్నారి చనిపోయింది. గత నెల సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బీహార్‌కు చెందిన ఆరేళ్ల పిల్లగాడిపై కుక్కలు దాడి చేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. వనస్థలిపురానికి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అలోక్ ఆరాధే, జస్టిస్‌ జే. అనిల్‌కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నెల 2న జరిగిన విచారణ సందర్భంగా వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కుక్కకాటుతో చనిపోయిన కుటుంబానికి పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటే సరిపోదని, భవిష్యత్తులో అలాంటి సంఘటలపై కొన్ని విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కోర్టు ఇచ్చిన ఆదేశానికి ఏంచర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ధర్మాసనం ఆదేశాలతో కౌంటర్‌ దాఖలు చేసిన జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్‌ 350, బంజారాహిల్స్‌లో 250 కుక్కలకు స్టెరిలైజేషన్‌ చేసినట్టు పేర్కొన్నది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన కుక్కల దాడి బల్దియా పరిధిలోకి రాకున్నాస్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించినట్టు పేర్కొన్నది. కొత్త నిబంధనలు రూపొందించినట్టు జీహెచ్‌ఎంసీ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. నిబంధనలు ఎప్పుడూ ఉంటాయని.. గణాంకాలు కాదు..చిన్నారులు చనిపోకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు పేర్కొన్నది. గతంలో ఎక్కడ దాడులు జరిగాయి? ఎక్కడ అలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయో పరిశీలించి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కుక్కల దాడిని తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నది. ఈ విషయంలో ఉదాసీనతను సహించబోమని నిర్లక్ష్యం వహించే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించింది. వారం లో కమిటీ ఏర్పాటు తో పాటు కార్యాచరణ రూపొందించాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే ఆదేశాలు జారీచేయాల్సి ఉంటుందని పేర్కొన్నది.

Raju

Raju

Writer
    Next Story