హాథ్రస్‌ ఘటన: భోలే బాబా కోసం గాలింపు

హాథ్రస్‌ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121 చేరింది. మృతుల్లో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు.ఈ ఘటనపై యూపీ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 24 గంటల్లో నివేదిక అందించాలని ఆదేశించింది.

హాథ్రస్‌ ఘటన:  భోలే బాబా కోసం గాలింపు
X

యూపీ హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీ గ్రామంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని రేపింది. భోలే బాబా పాద ధూళి కోసం పరుగెత్తిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయారు. మంగళవారం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121 చేరింది. మృతుల్లో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో మరో 28 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రులు, ట్రామా సెంటర్లలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది.

ఈ ఘటనకు బాధ్యులైన సత్సంగ్‌ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రా అదనపు డీజీపీ, అలీగఢ్‌ డివిజన్‌ అదనపు కమిషనర్‌ నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 24 గంటల్లో నివేదిక అందించాలని ఆదేశించింది.

హాథ్రస్‌లో జరిగిన సత్సంగ్ ప్రైవేట్‌ కార్యక్రమమని భక్తుల భారీ రద్దీ వల్ల తొక్కిసలాట చోటు చేసుకున్నదని సికింద్రరావు పోలీస్‌ స్టేషన్‌ అధికారి ఆశీష్‌ తెలిపారు. ఈ ఘటనకు కారణమైన నారయణ్‌ సాకార్‌ హరి..అలియాస్‌ సాకార్‌ విశ్వ హరి 'భోలే బాబా' గా ప్రసిద్ధి చెందిన ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాబా ఇంకా దొరకలేదని, ఆయనను పట్టుకోవడానికి గాలింపు బృందాలు యత్నిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

ఈ హాథ్రస్‌ కార్యక్రమానికి యూపీలోని వేర్వేరు జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భోలే బాబా వెళ్లిపోతుండగా..భక్తులు ఆయన పాదాలను తాకడానికి పరుగెత్తారు. వేదిక సమీపం లోని కాల్వ నుంచి నీళ్లు పొంగిపొర్లడంతో రోడ్డంతా బురదమయంగా మారింది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు జారిపడటంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. వేల సంఖ్యలో భక్తులు హాజరైనప్పటికీ సత్సంగ్‌ నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాటు చేయలేదని భక్తులు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. చనిపోయిన కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 చొప్పున పరిహారాన్ని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు.

Raju

Raju

Writer
    Next Story