రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు

మాజీ మంత్రి హరీశ్‌ రావు విజ్ఞప్తి

రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు
X

రుణమాఫీ కాలేదని రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని మాజీ మంత్రి హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు. రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్‌ అగ్రికల్చర్‌ ఆఫీస్‌ లో ఆత్మహత్య చేసుకున్న సురేందర్‌ రెడ్డి మృతదేహాన్ని ఆయన గాంధీ ఆస్పత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని.. బీఆర్‌ఎస్‌ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేసే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టబోమన్నారు. ముఖ్యమంత్రి తప్పుడు ప్రకటనలతోనే రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. సీఎం ఇకనైనా బుకాయించడం మాని బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతులందరికి రుణమాపీ అమలు చేయాలన్నారు. రుణమాఫీ అమలు కోసం సీఎం రేవంత్‌ రెడ్డి నిర్దేశించుకున్న డెడ్ లైన్ ముగిసి నెల అవుతోందని, ఇప్పటికైనా కళ్లు తెరిచి మాట నిలుపుకోవాలన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫెయిల్‌ అయ్యింది : కేటీఆర్‌

రుణమాఫీ కాలేదని రైతు సురేందర్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సురేందర్‌ రెడ్డి ఆత్మహత్య తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫెయిల్‌ అయ్యిందన్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇంకా ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రశ్నించారు. రైతులు ఇలా ప్రాణాలు తీసుకోవద్దని, బాధలు పడొద్దనే తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్నామని గుర్తు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మళ్లీ రైతుల ఆత్మహత్యలు తీవ్రంగా బాధిస్తున్నాయన్నారు. ఇకనైనా ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో తమ వైఫల్యాన్ని ఒప్పుకొని ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Next Story