ఆ పెద్దల గుట్టు తేల్చండి

జస్టిస్ హేమ కమిటీ నివేదిక లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణకు ఐజీ నేతృత్వంలో టీమ్ ఏర్పాటు చేసిన కేరళ సర్కారు

ఆ పెద్దల గుట్టు తేల్చండి
X

మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయంటూ కొందరు నటీమణులు ఆరోపించడం సంచలనం రేపుతున్నది. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేరళ సీఎం పినరయి విజయన్‌.. పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తాజాగా వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఐజీ స్పర్జన్‌ కుమార్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు.

హేమ కమిటీ రిపోర్ట్‌పై స్పందించిన గాయని చిన్మయి మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రిపోర్ట్‌ సిద్ధం చేసినందుకు ఆ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని శిక్షించడం అంతసులభం కాదన్నారు. వారు రాజకీయంగా పరస్పర సంబంధాలు కలిగి ఉంటారని చిన్నయి పేర్కొన్నారు.

మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సిద్ధిఖీ నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నానంటూ నటి రేవతి సంపత్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రముఖ దర్శకుడు, కేరళ స్టేట్‌ చలనచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్‌ బాలకృష్ణన్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బెంగాలీ నటి శ్రీలేఖ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సిద్ధిఖీ, రంజిత్‌లు వారి పదవులకు రాజీనామా చేశారు.

తాజాగా మరో నటి మిను కూడా కొంతమంది నటులపై ఆరోపణలు చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన జయసూర్య, ముఖేశ్‌, మణియన్‌పిళ్ల రాజు, ఇడవల బాబుల వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆరోపించింది. వాళ్లు అసభ్య పదజాలతంతో దూషించారని చెన్నై వెళ్లిపోయయేలా చేశారని తెలిపారు.

Raju

Raju

Writer
    Next Story