'ఎమర్జెన్సీ' కి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ

సెన్సార్‌కు ఆదేశించలేమన్న హైకోర్టు

ఎమర్జెన్సీ కి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ
X

కంగనా రనౌత్‌ నటించిన 'ఎమర్జెన్సీ' కి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సినిమా విడుదల చేయాలని, సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని కోరుతూ చిత్ర సహ నిర్మాణ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బాంబే హైకోర్టు ఆశ్రయించింది. సెన్సార్‌ బోర్డు ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా సినిమా సర్టిఫికెట్‌ను నిలుపుదల చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్స్‌ సర్టిఫికేషన్‌ను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. అయితే ఈ విషయంపై సెప్టెంబర్‌ 18లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సెన్సార్‌ బోర్డుకు సూచించింది. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎమర్జెన్సీ మూవీపై వివాదం చాలారోజులుగా జరుగుతున్నది. పంజాబ్‌లో ఈ సినిమాపై నిరసన వ్యక్తమౌతున్నది. సినిమాలో వాస్తవాలను వక్రీకరించారని సిక్కు సమాజానికి చెందిన వారు అంటున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్‌ కనిపించనున్నారు. 1975 లో వచ్చిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో కంగనాతో పాటు అనుపమ్‌ ఖేర్‌, శ్రేయాస్‌ తల్పాడే, మహిమా చౌదరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వాస్తవానికి ఈ మూవీ సెప్టెంబర్‌ 6న విడుదల కావాల్సింది. సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో సినిమా విడుదలపై సందిగ్ధం నెలకొన్నది. చిత్రంలో తమను తక్కువగా చూపించారని విడుదలను అడ్డుకోవాలని సిక్కు సామాజికవర్గం మధ్య ప్రదేశ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రించగా.. వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్‌ బోర్డుకు సూచించింది. మరోవైపు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని శిరోమణి అకాలీదల్‌ కూడా సెన్సార్‌ బోర్డును కోరింది.

Raju

Raju

Writer
    Next Story