సెబీ చీఫ్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ప్రశ్నలు

ఆమెకు పదవీ విరమణ ప్రయోజనాలు మాత్రమే చెల్లిస్తున్నామని చెబుతున్న బ్యాంక్‌ ఆ మొత్తం జీతం కంటే ఎక్కువ ఎలా ఉంటుందని ప్రశ్నించిన పవన్‌ ఖేడా

సెబీ చీఫ్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ప్రశ్నలు
X

సెబీ చీఫ్‌ మాధవీ పురి బుచ్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ప్రశ్నలు సంధించింది. మాధవికి తాము ఎలాంటి వేతనం చెల్లించడం లేదంటూ ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇచ్చిన వివరణపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ఆమెకు పదవీ విరమణ ప్రయోజనాలు మాత్రమే చెల్లిస్తున్నామని చెబుతున్న బ్యాంక్‌ ఆ మొత్తం జీతం కంటే ఎక్కువ ఎలా ఉంటుందని ప్రశ్నించింది. మధ్యలో ఏడాది పాటు ప్రయోజనాలు ఇవ్వకపోవడాన్ని ఆ పార్టీ నిలదీసింది.

సెబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మాధవీ పురి బుచ్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి జీతభత్యాలు అందున్నాయంటూ సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించిన విషయం విదితమే. 2017లో ఆమె సెబీలో చేరినప్పటి నుంచి, ఇప్పటివరకు ఐసీఐసీఐ బ్యాంకు అధికారి హోదాలో రూ. 16.08 కోట్లు అందుకున్నారని, ఇదే కాంలో సెబీ నుంచి ఆమెకు అందింది కేవలం రూ. 3.3 కోట్లు అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేడా ఆరోపించారు. దీనిపై స్పందించిన ఐసీఐసీఐ బ్యాంక్‌ తాము ఎలాంటి వేతనం చెల్లించడం లేదని వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఖేడా మరోసారి మీడియా సమావేశం నిర్వహించి పలు ప్రశ్నలు సంధించారు.

కాంగ్రెస్‌కు ఇది సిగ్గు చేటు :అమిత్‌ మాలవీయ

సెబీ ఛైర్‌పర్సన్‌గా ఉంటూ.. మాధబి పూరీ బుచ్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి వేతనం తీసుకుంటున్నారన్న కాంగ్రెస్‌ ఆరోపణలను బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ తిప్పికొట్టారు. సెబీ చీఫ్‌ గురించి హిండెన్‌బర్గ్‌ నివేదిక ఎక్కడైతే ముగించిందో కాంగ్రెస్‌ అక్కడి నుంచి మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు. తాము మాధవికి ఎలాంటి వేతనం ఇవ్వలేదని ఐసీఐసీఐ ప్రకటించడం కాంగ్రెస్‌కు చెంపపెట్టులా మారిందన్నారు. తప్పుడు అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఆ పార్టీ ధ్యేయమని దుయ్యబట్టారు. గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు ఇది సిగ్గు చేటు అని మాలవీయ విమర్శించారు.

Raju

Raju

Writer
    Next Story