ఆపత్కాలంలో రాజకీయాలు చేసేటోళ్లం కాదు

ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన సీఎం రెండు రోజులు పత్తాలేడు.. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌ పై ఆరోపణలు చేస్తున్నడు : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

Update: 2024-09-03 08:44 GMT

ఆపత్కాలంలో రాజకీయాలు చేసేటోళ్లం కాదని.. బీఆర్‌ఎస్‌ పార్టీ అలాంటి దిగజారుడు రాజకీయాలు ఎప్పటికీ చేయబోదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీశ్‌ రావు నేతృత్వంలో జగదీశ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులతో కూడిన పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం వరద ప్రభావ ప్రాంతాలను పరిశీలించింది. మొదటగా గండిపడిన నాగార్జున సాగర్‌ ఎడమ కాలువను మాజీ మంత్రులు, పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రమంతా భారీ వర్షాలు కురుస్తుంటే సీఎం రేవంత్‌ రెడ్డి రెండు రోజులు పత్తా లేకుండా పోయారని.. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పెళ్లికి, చావుకు తేడా తెలియని పరిస్థితిలో సీఎం ఉన్నారని.. ఓదార్పు కోసం వచ్చారో.. సంబరాలు చేసుకోవడానికి వచ్చారో అర్థం కాలేదన్నారు. ఖమ్మం జిల్లా మంత్రులు ఎడమ కాల్వ నీళ్లను తమ ప్రాంతానికి తీసుకెళ్లేందుకు తూముల గేట్లకు వెల్డింగ్‌ చేయించి అక్కడ పోలీసులను కాపలా పెట్టారని, వరద ఎక్కువ కావడంతో వాటిని ఓపెన్‌ చేసే అవకాశం లేక గండి పడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇది ఎంతమాత్రమూ ప్రకృతి వైపరీత్యం కాదని.. మంత్రుల నిర్వాకమని చెప్పారు.

ఖమ్మంలో ప్రజలు వరదలో కొట్టుకుపోవడానికీ ఈ ప్రభుత్వమే కారణమన్నారు. వరద బాధితులు 9 గంటలు సహాయం కోసం ఎదురు చూసినా వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చీకటి పడిన తర్వాత మంత్రులు మొసలి కన్నీళ్లు కార్చి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారన్నారు. ప్రజలు వరదలో చిక్కుకుని అల్లాడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాల్లో మునిగి తేలుతున్నారని మండిపడ్డారు. రైతులు పంట నష్టపోవడమే కాదు.. మరో పంట వేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. తమ పొలాలు బాగు చేసి ఇస్తే చాలు తమకు ఇంకా సాయం అక్కర్లేదని రైతులు వేడుకుంటున్నారని తెలిపారు. ఎడమ కాలువ కింద పొలాలన్నీ రాళ్లు రప్పలు, ఇసుక మేటలతో నిండిపోయాయన్నారు. ప్రభుత్వం వరద పరిస్థితిపై స్పందించడానికి ముందే బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు బాధితుల వద్దకు వెళ్లి సహయక చర్యలు చేపట్టారని తెలిపారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే ఆయన నిద్రపోకుండా మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ ప్రజల్లో ఉంచి పని చేయించేవారని గుర్తు చేశారు. ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. నష్టానికి పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత అని, పంట కొట్టుకుపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News