కాబోయే లోక్‌సభ స్పీకర్‌ కాషాయపార్టీకి చెందిన వ్యక్తే!

లోక్‌సభ స్పీకర్‌ ఎవరు కానున్నారనే ఉత్కంఠ తెరపడినట్లు సమాచారం. ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ స్పీకర్‌ పదవిని తన వద్దే ఉంచుకోవాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

By :  Raju
Update: 2024-06-17 11:39 GMT

ఈ నెల 24 నుంచి 18వ లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక జరగనున్నది. లోక్‌సభ స్పీకర్‌ ఎవరు కానున్నారనే ఉత్కంఠ తెరపడినట్లు సమాచారం. ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ స్పీకర్‌ పదవిని తన వద్దే ఉంచుకోవాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వామ్యపార్టీ అయిన జేడీయూ సీనియర్‌ నేత కేసీ త్యాగి దీనిపై మాట్లాడుతూ.. అధికారపార్టీకి ఉన్నసంఖ్యా బలం దృష్ట్యా ఆ పార్టీకి చెందిన వ్యక్తే స్పీకర్‌గా ఉంటారనిచేశారు.

2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించడంతో స్పీకర్‌ పదవి ఎవరికి ఇస్తారు అనే చర్చకు ఆస్కారం ఏర్పడలేదు. కానీ ఈసారి బీజేపీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏలోని టీడీపీ, జేడీయూలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి. ఈ రెండుపార్టీలు స్పీకర్‌ పదవిని ఆశిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ ఎన్డీఏ మిత్రులకు డిప్యూటీ స్పీకర్‌ పోస్టు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే డిప్యూటీ స్పీకర్‌ పదవి తమ కూటమికి ఇవ్వకపోతే.. స్పీకర్‌ పోస్టుకు అభ్యర్థిని నిలుపాలని ప్రతిపక్ష ఇండియా కూటమి యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

బీజేపీ భాగస్వామ్యపక్షాల పార్టీల పట్ల పదేళ్లుగా వ్యవహరించిన తీరును ఉదహరిస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలు ఒమర్‌ అబ్దుల్లా, ఆదిత్యాఠాక్రే, సంజయ్‌రౌత్‌ లాంటి వాళ్లు స్పీకర్‌ పదవిని టీడీపీ, జేడీయూలలో ఎవరో ఒకరు తీసుకోవాలని సూచించారు. సంజయ్‌ రౌత్‌ అయితే టీడీపీ స్పీకర్‌ పదవి తీసుకుంటానంటే తాము మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ స్పీకర్‌ పదవి విషయంలో బీజేపీ రాజీ పడలేదని కేసీ త్యాగి వ్యాఖ్యల బట్టి తెలుస్తోంది.


Tags:    

Similar News