కూటమి 3 నెలల పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం : జగన్

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

By :  Vamshi
Update: 2024-08-30 13:19 GMT

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీపై బురద జల్లడం కార్యక్రమాలతో పాలన గాలికొదిలేశారని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని జగన్ విమర్శించారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్‌ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందన అత్యంత దారుణంగా ఉందన్నారు.

సీఎం తనయుడు విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు. మరోవైపు లేడీస్ హాస్టల్ వాష్‌రూములో హిడెన్‌ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేసే ఘటన ఇది. సీఎం చంద్రబాబు ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.  

Tags:    

Similar News