ఖమ్మం వరదల్లో సుభాన్‌ హీరో.. ప్రభుత్వం జీరో

వరదలు ముంచెత్తుతున్నా పట్టించుకోని సీఎం ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడం సిగ్గుచేటు : మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి

Update: 2024-09-05 08:14 GMT

ఖమ్మం వరదల్లో జేసీబీ డ్రైవర్‌ సుభాన్‌ హీరో అయితే.. ప్రభుత్వం, ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు జీరోలని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్క రాష్ట్రం నుంచి జేసీబీ డ్రైవర్‌ ప్రాణాలకు తెగించి తొమ్మిది మందిని కాపాడి హీరో అయ్యాడని అన్నారు. రాష్ట్ర కేబినెట్‌ లో ఖాళీగా ఉన్న మిగిలిన ఆరు పదవులు భర్తీ చేసేప్పుడు సుభాన్‌ లాంటి దృఢమైన వ్యక్తిని మంత్రిగా పెట్టుకుంటే ప్రజలకు ధైర్యమైన ఇస్తారని అన్నారు. ప్రజలు భారీ వర్షాలు, వరదలతో రెండు రోజులు అల్లాడుతుంటే పట్టించుకోని రేవంత్‌ రెడ్డి మూడో రోజు తీరిగ్గా ఖమ్మం పర్యటనకు వెళ్లి.. ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. వరద తీవ్రతపై అధికారులతో రివ్యూ చేస్తున్న సమయంలో ప్రతిపక్షంపై నిందలు వేయడం ఏమిటని మండిపడ్డారు. కేసీఆర్‌ కనిపించడం లేదంటూ మాట్లాడటం ఆశ్చర్యకరమని.. కేసీఆర్ వ్యక్తి కాదు వ్యవస్థ అన్నారు. ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేయడంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలే ముందున్నారని తెలిపారు. మానవీయ కోణంలో పార్టీ శ్రేణులు వరద బాధితులకు అండగా ఉన్నారని తెలిపారు.

విపత్తలు సమయంలో ప్రభుత్వాలు మానవీయ దృక్పథంతో పనిచేయాలని, దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వానికి మానవీయత లేదన్నారు. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని, వరద బాధితులు హాహాకారాలు చేస్తుంటే మంత్రులు, సీఎం తలోరకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం హైదరాబాద్‌ నుంచి కదలకుండా వరద ప్రభావ ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలని కోరడం విచిత్రంగా ఉందన్నారు. ప్రజలను కాపాడేందుకు హెలీక్యాప్టర్‌ దొరకలేదని మంత్రులు చెప్పడం దురదృష్టకరమన్నారు. అకాల వర్షాలతో 18 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని, బాధిత రైతులందరికీ పరిహారం చెల్లించాలన్నారు. వరద నష్టంపై ప్రాథమిక అంచానాలు పంపలేదని కేంద్రం లేఖ రాసిందని అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుందన్నారు. చేరికలకు ఒక మంత్రిని ప్రతిపక్షాలను తిట్టడానికి ఒక మంత్రిని పెట్టారు కానీ ప్రజలను ఆదుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదన్నారు. పరామర్శలకు వెళ్లిన సీఎం జీపులో నిలబడి చేతులు ఊపుతారా, చావుకు, పెళ్లికి ఒకేలా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడంతోనే వట్టెం పంపుహౌస్‌ నీట మునిగిందన్నారు. రేవంత్‌ సీఎం అయి 9 నెలలవున్నా పాలమూరు బిడ్డ రేవంత్‌, ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఇంత వరకు ఆ ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడలేదన్నారు. చిల్లర చేష్టలు, చిలిపి మాటలతో ప్రతిపక్షాన్ని తిడుతున్న ప్రభుత్వం ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రెస్‌ మీట్‌ లో నాయకులు వాసుదేవ రెడ్డి, తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News