రేవంత్‌ విధానాలతోనే రాష్ట్రానికి ముప్పు

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నది. రేవంత్‌ యత్నాలు ఎన్నటికీ సాధ్యం కాకపోగా.. అరకొర మెజారిటీతో ఆయన ప్రభుత్వానికే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By :  Raju
Update: 2024-06-16 05:13 GMT

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను లేకుండా చేద్దామనే రేవంత్‌ యత్నాలు ఎన్నటికీ సాధ్యం కాకపోగా.. అరకొర మెజారిటీతో ఆయన ప్రభుత్వానికే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారని తెలంగాణవాదులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ రాజకీయాలు ఎలా ఉంటాయో పదేళ్ల కాలంలో ప్రజలందరి అనుభవంలో ఉన్నదే. బీజేపీ యేతర ముఖ్యంగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలను కూలగొట్టిన చరిత్ర ఆపార్టీది. ప్రజాతీర్పును కాలరాస్తూ అరుణాచల్‌ ప్రదేశ్‌ మొదలు మధ్యప్రదేశ్ వరకు ఏం చేసిందో అందరికీ తెలిసిందే. ఇవన్నీ తెలిసి కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను చేర్చుకున్న ఆపార్టీ మరికొందరినీ బ్లాక్ మెయిల్‌ రాజకీయాలతో తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నంత వరకే కాంగ్రెస్‌ ప్రభుత్వ మనుగడ కొనసాగుతుందనే విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు మరిచిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోవైపు చంద్రబాబు మళ్లీ తెలంగాణపై కన్నేశాయి.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి, తద్వారా తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలనే కుట్రలను కేసీఆర్‌ బద్దలుకొట్టారు. నాడు కేసీఆర్‌ ప్రభుత్వ అప్రమత్తతతో చంద్రబాబు పాచికలు పారలేదు. ఈ వ్యవహారం తర్వాత బాబు ఆంధ్రకు మకాం మార్చాల్సిన పరిస్థితిని కేసీఆర్‌ క్రియేట్‌ చేశారు. 2014లో ఓటమి తర్వాత వైసీపీ ఖమ్మంలో ఒక ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నా ఏపీ ప్రయోజనాల కోసం పనిచేయాలంటే ఇక్కడ రాజకీయాలకు దూరంగా ఉండాలని హుందాగా వైదొలిగింది. అదే విధానాన్ని ఇప్పటివరకు అనుసరిస్తున్నది. కానీ బాబు ఎన్నికలకు ముందు ఖమ్మంలో పర్యటించి అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఖమ్మం నుంచే టీడీపీకి పూర్వ వైభవం తీసుకొద్దమన్నారు. కానీ మొన్నటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి పోటీ చేయలేదు. టీడీపీ అధినేత రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పరోక్షంగా మద్దతు ప్రకటించారు. ఏపీలో బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేశారు. కాంగ్రెస్‌పార్టీపై గెలిచిన తుమ్మల నాగేశ్వర్‌ రావు మంత్రి హోదాలోనే ఏపీలో కూటమి గెలుపును పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలో టీడీపీ ఆఫీసుకు వెళ్లి సంబరాల్లో పాలుపంచుకున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌ అయితే లోక్ ఎన్నికలకు ముందు ఓ మీడియా ఛానల్‌లో చంద్రబాబు మీకు సీనియర్‌ అంటే ఫైర్‌ అయ్యారు. అలా అని ఎవరైనా అంటే ముడ్డి మీద తంతాను అన్నారు. ఆయన నాకు సీనియర్‌ కాదు మేము సహచరులం అన్నారు. దానికి కట్టుబడి ఉన్నారా? అంటే ఉత్తముచ్చటే. బాబు మరోసారి సీఎం బాధ్యతలు చేపట్టనున్నారు అన్నప్పుడు ఒక రాష్ట్ర సీఎంగా అభినందనలు చెప్పడం లో తప్పులేదు. కానీ ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వెళ్తారా? అంటే తప్పకుండా వెళ్తాను అన్నారు. రేవంత్‌ను ఆహ్వానించలేద సరికదా బాబు నుంచి స్పందన లేదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్నివినియోగించుకుని వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేవంత్‌ అనుసరిస్తున్న అత్యుత్సాహంతో తెలంగాణ పరువు తీస్తున్నారనే విమర్శలున్నాయి. రేవంత్‌ ప్రభుత్వం కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను బద్నాం చేయాలనే ఏకైక అజెండాతో చేస్తున్న చర్యలతో ఏడు నెలల కాలం ఇప్పటికే వృథా అయ్యింది.

ప్రజా సమస్యలను పక్కన పెట్టి, రాష్ట్రానికి సీఎం అనే విషయాన్ని మరిచి పీసీసీ అధ్యక్షుడిగా రాజకీయాలే చేస్తాననే ఆయన వైఖరితో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాల నచ్చి పనిచేస్తున్న సీనియర్లను కాదని రేవంత్‌కు సీఎంగా అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని మరిచి ఆయన చేస్తున్న రాజకీయ విన్యాసాలు రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వ పుట్టి ముంచుతుందని అంటున్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాలను కూలిపోతాయని బీజేపీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచే ప్రయత్నాల వల్ల నష్టపోయేది కాంగ్రెస్‌పార్టీనే. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ మనుగడకు ముప్పు ఏర్పడితే దానికి కారణమూ రేవంత్‌ విధానాలే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Tags:    

Similar News