లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం

రాయ్‌బరేలి నుంచి లోక్‌సభకు ఎన్నికైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

By :  Vamshi
Update: 2024-06-25 11:18 GMT

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో రాయ్‌బరేలి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదోసారి లోక్ సభలో ప్రమాణం చేశారు. రాహుల్ చూసేందుకు తల్లి సోనియా గాంధీ, ప్రియాంక పార్లమెంట్‌కు వచ్చారు. రాహుల్ ప్రమాణం చేస్తున్న సమయంలో జోడో..జోడో అని కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు.తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్ర మంత్రులు తెలుగులో ప్రమాణం చేశారు. వారిలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలుగులో ప్రమాణం చేశారు. లోక్ సభ స్పీకర్ ఎంపికపై తాము అన్ని రాజకీయ పార్టీల సభాపక్ష నేతలతో సంపద్రింపులు జరిపామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు.

లోక్‌సభ స్పీకర్‌ పదవి అనేది పార్టీకి సంబంధించింది కాదని, ఇది సభా నిర్వహణకు సంబంధించిన అంశమని మంత్రి పేర్కొన్నారు.స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం ఆనవాయితీ అని, దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌ స్పీకర్‌ పదవికి తమ అభ్యర్ధిని బరిలో నిలిపిందని చెప్పారు. స్పీకర్‌ పదవికి పార్లమెంట్ చరిత్రలో ఇప్పటివరకూ ఎన్నడూ ఎన్నిక జరగలేదని గుర్తుచేశారు. తమకు డిప్యూటీ స్పీకర్‌ పదవి కేటాయిస్తే తాము ఎన్డీయే స్పీకర్‌ అభ్యర్ధికి మద్దతు ప్రకటిస్తామని కాంగ్రెస్‌ షరతు విధించిందని చెప్పారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులను ఇలా ఇచ్చిపుచ్చుకోవడం సరైంది కాదని మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. షరతుల ఆధారంగా ప్రజాస్వామ్యం నడవదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News