సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవ్వరూ భయపడరు

వరద బాధితులకు ఉడతాభక్తిగా సాయం చేస్తున్నాం : మాజీ మంత్రి హరీశ్‌ రావు

Update: 2024-09-05 09:01 GMT

సీఎం రేవంత్‌ రెడ్డి తాటాకు చప్పుళ్లకు ఎవ్వరూ భయపడరని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు తాము వెళ్లినప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఓర్వలేకనపై తమపై దాడులు చేయించారని తెలిపారు. గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఖమ్మం వరద బాధితులకు బియ్యం, ఇతర నిత్యావసరాలను పంపే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం వరద బాధితులకు కనీసం అన్నం, నీళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. భారీ వర్షాలు, వరదలకు ఖమ్మం, మహబాబాబాద్‌ జిల్లాల్లో తీరని నష్టం వాటిల్లిందన్నారు. బాధితుల కోసం సిద్దిపేట నుంచి తాము ఉడతా భక్తిగా సాయం పంపుతున్నామని తెలిపారు. అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, ప్రభుత్వం ముందే మేల్కొని ఉంటే ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించే అవకాశం ఉండేదన్నారు. వరద బాధితుల కోసం బీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నెల జీతాన్ని అందజేస్తున్నామని తెలిపారు. బీజేపీ, మిగతా పార్టీల నాయకులు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. తమపై కాంగ్రెస్‌ నాయకులు ఖమ్మంలో దాడికి ప్రయత్నిస్తే అక్కడి ప్రజలు దుమ్మెత్తి పోశారన్నారు. వరదల్లో ఇల్లు మునిగి నష్టపోయిన వారికి రూ.2 లక్షల చొప్పున సాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News