బీసీల సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయండి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఈనెల 10న ఇందిరా పార్క్ దగ్గర తలపెట్టిన బీసీల సత్యాగ్రహ దీక్ష పోస్టర్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజారామ్ యాదవ్‌తో కలిసి ఆవిష్కరించారు.

By :  Vamshi
Update: 2024-08-03 12:29 GMT

తెలంగాణలో వెంటనే సమగ్ర కుల జనగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనసభ వివిధ కుల సంఘాలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మీడియ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్, ఇతర బీసీ, కుల సంఘాలతో కలిసి, ఈనెల 10న ఇందిరా పార్క్ దగ్గర తలపెట్టిన బీసీల సత్యాగ్రహ దీక్ష పోస్టర్‌ను శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామరెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కి కట్టుబడి వెంటనే సమగ్ర కులజనగనణను జరిపి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి.. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. మరోసారి బీసీలను మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తే.. బీసీ సమాజం చూస్తూ ఊరుకోదని పరీక్షంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈనెల 10న ఇందిరాపార్క్ దగ్గర తలపెట్టిన బీసీల సత్యాగ్రహ దీక్షను కులాలు, సంఘాలు, పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమగ్ర కులజనగణన చేయాలని స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఏ సంఘాలు కూడా కాంగ్రెస్ పార్టీని అడగలేదని, తమకు తాము కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలను బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే సమగ్ర కులజనగణన చేస్తామని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. మరోసారి బీసీలను గొంతు కోయాలని చూస్తుందని ఆరోపించారు. దేశంలో రాహుల్ గాంధీ ఒక మాట, రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మాట.. వీరిద్దరి ద్వంద వైఖరిని జాతీయ స్థాయిలో ఎండగడతామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ముఠా జానారెడ్డి, కోదండరామిరెడ్డిలు కులజనగణనను అడ్డుకొని, మరోసారి బీసీల గొంతు కోసే కుట్రలు చేస్తున్నారని రాజారామ్ ఆరోపించారు.

Tags:    

Similar News