హరీశ్‌ రావు వ్యాఖ్యలను పోలీసులు తప్పుగా అర్థం చేసుకున్నరు

బీఆర్‌ఎస్‌ నాయకుడు దేవిప్రసాద్‌

Update: 2024-09-07 11:06 GMT

రాష్ట్రంలో శాంతిభద్రలు క్షీణించాయని, పోలీస్‌ వ్యవస్థను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కుప్పకూల్చిందని మాత్రమే మాజీ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలను పోలసులు తప్పుగా అర్థం చేసుకున్నారని బీఆర్‌ఎస్‌ నాయకుడు దేవిప్రసాద్‌ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌ లో మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. హరీశ్‌ రావు క్షేత్రస్థాయి పర్యటనల్లో తన దృష్టికి వచ్చిన అంశాలపై మాట్లాడారని తెలిపారు. ఖమ్మంలోని వరద ముంపు ప్రాంతాల్లో నలుగురు మాజీ మంత్రులు పర్యటిస్తే దాడులు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. కొందరు పోలీస్‌ అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని మాత్రమే హరీశ్‌ రావు అన్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి పోలీసులపై గౌరవం ఉందన్నారు. కేసీఆర్‌ పాలనలో పోలీస్‌ శాఖలో అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టారని తెలిపారు. 47 వేల మంది కానిస్టేబుల్స్‌ నియామకం చేశారని, పోలీసులకు వాహనాలు, స్టేషన్‌ల నిర్వహణకు నిధులిచ్చిన ఘనత కేసీఆర్‌ దేనన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలు శాంతిభద్రతల వైఫల్యంతో పాటు ప్రభుత్వ వైఫల్యం కూడా అన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఒకటి, రెండు ఎన్‌ కౌంటర్లు జరిగితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్‌ కౌంటర్లు ప్రారంభమయ్యాయని అన్నారు. బెస్ట్‌ టీచర్స్‌ అవార్డుల్లో పారదర్శకత లేదని మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌ రెడ్డి ఆరోపించారు. పీవీ నర్సింహారావు ఏర్పాటు చేసిన గురుకుల వ్యవస్థను కేసీఆర్‌ బలోపేతం చేశారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే గురుకులాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇకనైనా గాలి మాటలు మానుకోవాలని హితవు పలికారు.

Tags:    

Similar News