కాంగ్రెస్‌లో నామినేటెడ్‌ పోస్టుల లొల్లి

కాంగ్రెస్‌ పార్టీలో నామినేట్‌పోస్టుల భర్తీ కాక రేపుతున్నది. పదేళ్లు పార్టీ అధికారంలో లేకున్నా పార్టీనే అంటిపెట్టుకున్న వారికి అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

By :  Raju
Update: 2024-06-14 07:32 GMT

కాంగ్రెస్‌ పార్టీలో నామినేట్‌పోస్టుల భర్తీ కాక రేపుతున్నది. పదేళ్లు పార్టీ అధికారంలో లేకున్నా పార్టీనే అంటిపెట్టుకున్న వారికి అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 15న కాంగ్రెస్‌ ప్రభుత్వం 37 మంది కార్పొరేషన్‌ ఛైర్మన్‌లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది. పార్లమెంటు ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో వాళ్లు బాధ్యతలు చేపట్టలేదు. అయితే ఇప్పటికే ప్రకటించిన ఈ పోస్టులపై పలు ఫిర్యాదులు వచ్చాయి. పార్టీ గెలుపు కోసం పనిచేసి కష్టడిన వారిని జిల్లాల వారీగా గుర్తించి అందులో మార్పులు చేర్పులు చేయాలని ఆలోచిస్తున్నది.

సార్వత్రిక ఎన్నికలు ముగిసి బాధ్యలు చేపట్టే నాటికి నామినేటెడ్‌ పోస్టుల విషయంలో పలువురు మంత్రులు, సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అర్హతలు లేని వాళ్లకు పోస్టింగులు కట్టబెట్టారని ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ విషయం తెలియడంతో రాష్ట్ర నాయకత్వం ఈ 37 మంది జాబితాను ప్రక్షాళన చేయాలని పీసీసీ యోచిస్తున్నదట. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నామినేటెడ్‌ పోస్టుల జాబితా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పీసీసీకి నామినేటెడ్‌ పోస్టుల భర్తీ పెద్ద తలనొప్పిగా మారింది.

లోక్‌సభ ఎన్నికల్లోనే మాదిగ సామాజికవర్గానికి ఒక్క సీటు అయినా ఇవ్వరా అని మోత్కుపల్లి నర్సింహులు లాంటి వాళ్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. అలాగే వీహెచ్‌ ఖమ్మం లోక్‌సభ సీటు ఆశించి భంగపడ్డారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతున్నదని నిరసన గళం విప్పుతున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక అపాయింట్‌మెంట్స్‌ కూడా ఇవ్వడం లేదని మీడియా ముందే వాపోయారు. పార్టీలో దశాద్ద కాలంగా పనిచేస్తున్న వారికంటే కొత్తగా, సీఎం అనుయాయులకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శ ఉన్నది. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం కూడా నామినేటెడ్‌ పోస్టుల విషయంలో సమ న్యాయం పాటించాలని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా నామినేటెడ్‌ పోస్టుల్లో అనర్హులకు ఛైర్మన్‌ పదవులు ఇచ్చారని విమర్శిస్తున్నారు. దీంతో అనివార్యంగా ప్రకటించిన జాబితాలో ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వం ప్రకటించిన వారు బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకట్ట పడటం, జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయనడంతో వాళ్లలోనూ ఆందోళన మొదలైంది. 

Tags:    

Similar News