ఖమ్మంలో ఇంచు ఆక్రమించినా కూల్చెయ్యండి

సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ సవాల్‌

Update: 2024-09-04 08:24 GMT

ఖమ్మంలో తాను ఒక్క ఇంచు భూమి ఆక్రమించినా కూల్చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. బుధవారం తెలంగాణ భవన్‌ లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమ హాస్పిటల్‌ నిర్మించి 25 ఏళ్లవుతుందని.. తమ హాస్పిటల్‌ లోకి చుక్క వరద నీరు రాలేదన్నారు. ప్రజలను డైవర్ట్‌ చేసేందుకు తనపై సీఎం ఆరోపణలు చేయడంతో పాటు వాళ్ల పార్టీ వాళ్లతో దాడులు చేయించారని మండిపడ్డారు. తన హాస్పిటల్‌ కు మున్నేరుకు సంబంధమే లేదన్నారు. అసలు మున్నేరుకు ఎక్కడి నుంచి వరద వస్తుందో ముఖ్యమంత్రికి తెలుసా అని ప్రశ్నించారు. మున్నేరు పరీవాహక ప్రాంతంలో రాజీవ్‌ గృహకల్ప, జలగం నగర్‌ కాలనీలను కట్టించింది అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. మున్నేరుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, ఆదివారం ఉదయం వరకే నీటి మట్టం 33 అడుగులకు చేరిందని తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, దీంతోనే పెను నష్టం సంభవించిందన్నారు.

వరద బాధితుల పరామర్శకు కాదు.. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్టుగా రేవంత్‌ వ్యవహరించారన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు తాము ఎలా పని చేశామో ప్రజలందరికీ తెలుసన్నారు. ఖమ్మం, పాలేరు నుంచి మంత్రులు ఉన్నారని.. అయినా ప్రజలే తమ ప్రాణాలను కాపాడుకోవాల్సి వచ్చిందన్నారు. మున్నేరుకు రెండు వైపులా రీటైనింగ్‌ వాల్‌ కోసం తాను రూ.650 కోట్లు మంజూరు చేయించానని.. దానిని ఎందుకు కట్టలేదో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆక్రమించిన భూముల్లో మంత్రుల ఫంక్షన్‌ హాల్స్‌ ఉన్నాయని ప్రజలే చెప్తున్నారని, రెవెన్యూ మంత్రి వాటిపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని తెలిపారు. మరో మంత్రి విల్లాలు వక్ఫ్‌ బోర్డు భూముల్లో ఉన్నాయని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లకు వెళ్లి 36 గంటలయ్యిందని, అయినా వారిని ఆదుకోవడంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు. మున్నేరు సమస్యకు ప్రభుత్వ శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో హైడ్రాను మంత్రుల ఫంక్షన్‌ హాళ్లు, విల్లాల నుంచే మొదలు పెట్టాలన్నారు. తమపై దాడి చేసిన వారి పేర్లతో సహా ఖమ్మం సీపీకి ఫిర్యాదు చేశారని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రులు ఫెయిల్‌ అయ్యారని స్థానిక ప్రజలే చెప్తున్నారని అన్నారు.

మంత్రి తుమ్మల మనుషులే దాడి చేశారు : ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు మనుషులే తమపై దాడి చేశారని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ తెలిపారు. దాడి చేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయలేదన్నారు. ఖమ్మంలో కబ్జాలన్నీ కాంగ్రెస్‌ నేతల చలవేనని.. రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్‌ నేతల అక్రమ కట్టడాలను కూల్చేయాలన్నారు. భౌతికదాడులను ఎదుర్కొనే సత్తా బీఆర్‌ఎస్‌ కు ఉందన్నారు. వరద బాధితులను ఆదుకోకుండా ప్రభుత్వం గుండాయిజాన్ని ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు ఎకరానికి రూ.10 వేల సాయం అంటే ఏమాత్రం సరిపోదని ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ అన్నారు.

మంత్రి పొంగులేటి ఎస్‌ఆర్‌ గార్డెన్‌ కూల్చేయండి : బాల్క సుమన్‌

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సాగర్‌ కెనాల్‌ ను ఆక్రమించి కట్టిన ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ ను సీఎం కూల్చేయాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి దర్శకత్వంలోనే ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ నేతలపై దాడి జరిగిందన్నారు. తమ చివరి రక్తపుబొట్టు వరకు తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తామన్నారు. పొంగులేటి ఆక్రమణలు నిజమేనని సర్వే చేసి అధికారుల బృందం నిర్దారించిందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ నేతల కబ్జాలన్నీ బయట పెడతామన్నారు. హైడ్రా పేరుతో కొందరిని టార్గెట్‌ చేశారని, వాళ్లను భయపెట్టాలనే కూల్చివేతలకు పాల్పడుతున్నారని తెలిపారు.

Tags:    

Similar News