కాంగ్రెస్ 8 నెలల పాలన పడకేసింది : జగదీశ్వర్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 8 నెలల పరిపాలన పడకేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

Update: 2024-08-05 10:34 GMT

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 8 నెలల పరిపాలన పడకేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు, దాడులు తప్ప మరేమీ లేదని ఆయన అన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గత యాసంగి (రబీ) పంటకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు అందించ లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ పాలనలో యాసంగిలోనే భారీగా దిగుబడి వచ్చిందని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి లక్షలాది టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతోందని చెప్పారు. ఆ నీటిని కాలువల ద్వారా చెరువులు నింపే అవకాశం ఉందని కానీ ఈ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీళ్లు వస్తాయన్న సమాచారం తమకు ఉందని అన్నారు.

ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న సోయి రేవంత్ సర్కార్‌కి లేదన్నారు. కాళేశ్వరం మోటార్లతో నీటిని ఎత్తిపోసి సూర్యాపేట వరకు నీటిని తీసుకురావాలని కోరారు. ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు ఇవ్వవచ్చు అని కాంగ్రెస్ నేతలు అన్నారని మరి ఎస్సారెస్పీ నుంచి ఎందుకు సూర్యాపేటకు నీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించామని అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిన సీఎం రేవంత్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు సమయం అడిగామని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News