మళ్ళీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రాబోతుంది.. జడ్పీ చైర్మన్ల్‌తో కేసీఆర్

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండలని..కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని గులాబీ బాస్ కేసీఆర్ అన్నారు

By :  Vamshi
Update: 2024-07-02 14:17 GMT

తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్ల్‌తో మంగళవారం ఎర్రవెల్లి వారి నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలో వస్తే మళ్లీ రాదన్నారు. వారు చేసే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. ఏదో గాలివాటున అధికారంలోకి వచ్చారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో జడ్పీ చైర్మన్లు అందరూ తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని , విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ అభినందనలు తెలిపారు . భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు . ప్రజా జీవితంలో ఒకసారి నిలిచిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులని అన్నారు .

 


పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు , తాగు నీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్య తలెత్తి మతకల్లోలాలు కూడా చెలరేగడం బాధ కలిగిస్తున్నదని అన్నారు. అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నప్పుడు శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలన్నారు . గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని పదేళ్లలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని పేర్కొన్నారు . పార్టీ నాయకులను సృష్టిస్తుంది కాని నాయకులు పార్టీని సృష్టించరని , మంచి యువనాయకత్వాన్ని తయారు చేస్తామని పేర్కొన్నారు . అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా? అని ప్రజలే అసహించు కుంటున్నారని అన్నారు .



మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని అన్నారు . మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు . తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉన్నదని ఈ సారి బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఎవరికి బీ ఫామ్ దక్కితే వాళ్లదే విజయమని కేసీఆర్ స్పష్టం చేశారు. జడ్పీ చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , మాజీ మంత్రి , ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి , బాల్క సుమన్ , గండ్ర వెంకట రమణారెడ్డి , పైళ్ల శేఖర్ రెడ్డి , చిరుమర్తి లింగయ్య , బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గ్యాదరి బాలమల్లు , మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు . 

Tags:    

Similar News