సుంకిశాల టన్నెల్​ను పరిశీలించిన బీజేపీ ఎమ్మెల్యేలు

సుంకిశాల ఘటన జరిగి 12 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచిందని బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

By :  Vamshi
Update: 2024-08-13 16:00 GMT

సుంకిశాల ప్రాంతాన్ని బీజేపీ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. శాసన సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్. రెడ్డి సహా స్థానిక బీజేపీ నాయకులు ఘటనా స్థలాన్ని సందర్మించారు. ఆగస్టు 2న సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సుంకిశాల ఘటన రాష్ట్ర ప్రజలందర్నీ విస్తుపోయేలా చేసిందని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆగస్టు 2న ప్రమాదం జరిగితే సోషల్ మీడియాలో వచ్చే వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచిందో చెప్పాలంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తోందా? అంటూ ప్రశ్నించారు. మెుదట రూ.1,500 కోట్ల అంచనా అంటూ ఇప్పుడు రూ.2,215కోట్లకు ఎందుకు పెంచారో చెప్పాలంటూ మహేశ్వర్ రెడ్డి వరస ప్రశ్నలు సంధించారు.

ప్రాజెక్టు పూర్తికాక ముందే టన్నెల్ ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అనుమతి తీసుకోకుండానే కాంట్రాక్టర్ టన్నెల్ ఓపెన్ చేశారని అధికారులు చెప్తున్నారు. దీనిపై విచారణ చేశారా? ఘటనపై త్రిమెన్ కమిటీ వేశారు కదా మరి ఇంకా నివేదిక అందలేదా? అంటూ ప్రశ్నించారు. పంప్ హౌస్‌లో నాసిరకం పనులు చేశారని, మేఘా కంపెనీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే సీబీఐ విచారణకు అదేశించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేస్తే దీనికి ఎవ్వరూ బాధ్యత వహించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్. రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News