బండి సంజయ్‌ కి అసలు తెలివి ఉందా?

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాను కాపాడుకోవాలి : మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌

Update: 2024-08-27 13:12 GMT

బండి సంజయ్‌ కి అసలు తెలివి ఉందా అని మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాను ఆయన కాపాడుకోవాలన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీం కోర్టులో పార్టీల తరపున లాయర్లు ఉండరన్న విషయం బండి సంజయ్‌ గుర్తించాలన్నారు. ముకుల్‌ రోహత్గీ బీజేపీ ప్రభుత్వంలో అటార్నీ జనరల్‌ గా ఐదేళ్లు పని చేశారని, ఆయన సీనియర్‌ లాయర్‌ అని తెలిపారు. తాము బాంచెన్‌ అని ఉంటే కవిత ఎప్పుడో బయటకు వచ్చే వారని తెలిపారు. తాము చట్టప్రకారమే బెయిల్‌ సాధించామని తెలిపారు. మహిళలను ఇబ్బంది పెట్టిన ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ పై బీజేపీ కనీసం చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. బీజేపీలో చేరినందుకే హిమంత బిశ్వశర్మపై కేసులు లేకుండా చేసి సీఎం చేశారని అన్నారు. ఏపీలో ఇద్దరు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన తర్వాత ఏడీ కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీలో చేరిన ఎంతో మంది నేర చరితులపై విచారణే జరగడం లేదన్నారు. కేసీఆర్‌ ను ఇబ్బంది పెట్టేందుకే కవితపై రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని అన్నారు.

రాజకీయ నాయకులు కాకుంటే ఈ కేసులో 15 రోజులకే బెయిల్‌ వచ్చేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో కవిత క్రియాశీలంగా పని చేశారని తెలిపారు. బతుకమ్మ పండుగను ప్రపంచంలోని అనేక దేశాలకు తీసుకెళ్లారని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీల నాయకులను మాత్రమే జైళ్లో పెట్టారని అన్నారు. ఈ కేసులో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదన్నారు. చార్జిషీట్‌ దాఖలు చేసిన తర్వాత నిందితులు జైళ్లో ఎందుకు ఉండాలని కోర్టు అడిగితే అడిషనల్‌ సొలిసిటర్‌ ఆ ప్రశ్నకు నీళ్లు నమిలారని అన్నారు. ఎవరు జైళ్లో ఎన్ని రోజులు ఉండాలనేది అమిత్‌ షా నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. మహిళలకు చట్టబద్దమైన హక్కులు ఉంటాయని తెలిపారు. ఆలస్యమైనా కవితకు బెయిల్‌ వచ్చిందన్నారు. కవిత బెయిల్‌ పై కాంగ్రెస్‌ లీడర్లు పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ కుమార్‌ అన్నారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపై వ్యాఖ్యానించే ముందు అన్ని తెలుసుకొని మాట్లాడాలన్నారు. కోర్టును కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ధిక్కరణ కేసులు వేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News